Anand Mahindra on 90Hours Work Week : 'వారానికి 90 గంటలు పని' అంశంపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పని విధానం సరైన పద్దతి కాదని తెలిపారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2025లో ప్రసంగిస్తూ ఈ మేరకు స్పందించారు. ఎన్ని గంటలు చేశామనేది కాదు, ఎంత నాణ్యతతో పని చేస్తామనేది ముఖ్యం అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.
"నారాయణ మూర్తి (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు) సహా ఇతర ప్రముఖులను నేను చాలా గౌరవిస్తా. అందుకే దీనిని తప్పుగా తీసుకోవద్దు. కానీ, పని గంటలపై చర్చ తప్పు దిశలో సాగుతుందని నేను భావిస్తున్నా. నా దృష్టిలో 40 గంటలా, 48 గంటలా, 70 గంటలా లేదంటే 90 గంటలా అనేది ముఖ్యం కాదు. ఎంత నాణ్యమైన పనిని అందించామనేదే ముఖ్యం. మీరు 10 గంటలు పని చేసినా, ఎలాంటి అవుట్‌పుట్ ఇస్తున్నారనేది ముఖ్యం."
- ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్
మీ కంపెనీలో ఎలాంటి ఉద్యోగులు ఉండాలని కోరుకుంటారు అని ఏ యువతి అడగగా, 'తమ కంపెనీలో తెలివిగా నిర్ణయాలు తీసుకోనేవాళ్లను, బాగా పని చేసే వాళ్లే ఉండాలని నేను కోరుకుంటా' అని ఆనంద్ మహీంద్ర చెప్పారు.
'వారానికి 100 గంటల పని- బాత్రూమ్‌లో ఏడ్చేదాన్ని'
ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై - ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా ఘాటుగా స్పందించారు. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. సుదీర్ఘ పని గంటలు ఉన్నంతమాత్రాన ఉత్పాదకత ఏమీ ఉండదని అన్నారు. అంతేగాక, కుటుంబం, మానసిక ఆరోగ్యం కూడా ప్రతీ వ్యక్తికి ముఖ్యమేనని గుర్తుచేశారు. ఈమేరకు 'అవకాశాలు, హార్డ్‌వర్క్, ఆనందం' పేరుతో ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
'సండేను సన్డ్యూటీగా మార్చండి'
ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అలాగే ఛైర్మన్ వ్యాఖ్యలపై ఆ కంపెనీ ఇచ్చిన వివరణపై కూడా ఆమె మరో పోస్ట్ పెట్టారు. అందులో "ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆశ్చర్యానికి గురయ్యా" అని అన్నారు. తాను చేసిన పోస్ట్‌కు #MentalHealthMatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తు చేశారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
వారానికి 70 గంటలు వర్క్ చేశా, అందుకే ఆ సలహా ఇచ్చా : నారాయణమూర్తి