Limited Supply Beers In Telangana : తెలంగాణలో పండుగ వచ్చిందంటే చాలు చుక్క, ముక్క ఉండాల్సిందే. ఏదైనా సెలవు రోజు వచ్చిందంటే చాలు మంచి బ్రాండ్ మద్యం తెప్పించుకొని, సరదాగా అందరూ కూర్చొని తాగుతుంటారు. దీంట్లో ఒక్కక్కరికి ఒక్కో బ్రాండ్ అంటే ఇష్టం. వారికి నచ్చిన బ్రాండ్ ఆ వైన్ షాప్‌లో దొరకలేదంటే ఎంత దూరమైనా వెళ్లి తెచ్చుకొని తాగుతుంటారు. అయితే తాజాగా ఓ ప్రముఖ బ్రాండ్ బీర్ల సంస్థ సరఫరాను నిలిపివేసింది. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్ లేదని తెగ ఫీల్ అవుతున్నారు.
బీర్ల సరఫరా నిలిపివేత : అయితే తాజాగా రాష్ట్రంలో ఆ ప్రముఖ బ్రాండ్ బీర్ల సరఫరాకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రేషన్ విధించింది. మద్యం దుకాణాలు, బార్లకు నిర్ణీత పరిమితి విధించారు. గత ఏడాదిలో తీసుకున్న సరుకును పరిగణలోకి తీసుకొని దానికి నాలుగు రెట్లు మాత్రమే అధికంగా ఇస్తున్నారు. సాధారణంగా అయితే ఈ పరిమితి ఉండేది కాదు. అవసరాన్ని బట్టి ఎంతైనా కొనే అవకాశం ఉండేది. ఆ బ్రాండ్ బీర్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో టీజీబీసీఎల్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేసిన కంపెనీ : బీర్ల ఉత్పత్తి ధర కన్నా తక్కువ ధరకు సరఫరా చేయాల్సి రావడంతో తాము నష్టపోతున్నామని ఇప్పుడున్న ధర కంటే దాదాపు 33 శాతం అదనంగా పెంచాలని ఆ బ్రూవరీస్ కంపెనీ ప్రతినిధులు ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ధర పెంచని పక్షంలో సరకు ఇవ్వమని అందులో కంపెనీ స్పష్టం చేసింది. సంగారెడ్డి ప్రాంతంలో ఉన్న రెండు ఉత్పత్తి యూనిట్లలో ఇప్పటికే ఒకదానిలో తయారీని ఆపివేసింది. మరో యూనిట్‌లోనూ టీజీబీసీఎల్ ఇంతకు ముందే ఇచ్చిన ఆర్డర్లు ఉండటంతో ఉత్పత్తి జరుగుతుంది.
కొత్త బీర్ల కంపెనీలకు అనుమతులు : ఆ కంపెనీ నోటీసును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడంలేదు. పైగా కొత్త కంపెనీలను అనుమతించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్సైజ్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే టీజీబీసీఎల్ ముందుజాగ్రత్త చర్యగా ఆ బ్రాండ్ బీర్ల సరఫరాలో పరిమితి విధించింది. అయితే ఆ సంస్థ నుంచి గతంలో కొనుగోలు చేసిన సరకు టీజీబీసీఎల్ వద్ద భారీగా నిల్వ ఉన్నాయి.
దీంతో దాదాపు 40 రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లకు సరఫరా చేయగలదని సమాచారం. తెలంగాణ మార్కెట్‌లో ఆ కంపెనీ బీర్ల వాటానే 60% మేర ఉండటంతో అంతపెద్ద వాటాను ఆ కంపెనీ వదులుకోబోదని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఆ బ్రాండ్ బీర్లు అందుబాటులో ఉండటం లేదంటూ ఎక్సైజ్‌శాఖ కాల్‌సెంటర్‌కు వినియోగదారుల నుంచి ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పండగపూట బీరు కావాలంటే త్వరగా వెళ్లి తెచ్చుకోవడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు మందు బాబులు.