15x15x15 Investing Rule :డబ్బుతో నడిచే ఈ ప్రపంచంలో చాలా మంది భారీగా సంపదను సృష్టించుకోవాలని కలలుకంటుంటారు. దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవడంలో మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అవుతాయి. అయితే ఇందులోనూ కొన్ని ట్రిక్స్ ఉంటాయి! కొన్ని రూల్స్ పాటిస్తే అనుకున్న దాని కన్నా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావొచ్చు! ఇలాంటి వాటిల్లో ఒకటే ఈ '15x15x15' రూల్. ఈ రూల్‌తో 15 ఏళ్లలోనే మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు! అదెలాగంటే?
15x15x15 రూల్ అంటే ఏంటి?
మ్యూచువల్ ఫండ్‌లో 15x15x15 రూల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని ప్రకారం, మీరు 15ఏళ్ల పాటు, నెలకు రూ.15వేలు చొప్పున 15 శాతం యాన్యువల్ రిటర్నులు ఇచ్చే మ్యూచువల్ ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది.
దీనిని మరింత వివరంగా చెప్పుకోవాలంటే, మీరు నెలకు రూ.15వేలు చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఇలా 15ఏళ్ల పాటు చేయాలి. దీని వల్ల మీరు పెట్టే పెట్టుబడి మొత్తం విలువ రూ.27 లక్షలు అవుతుంది. దీనిపై మీకు 15 శాతం వార్షిక రాబడి వచ్చిందంటే చాలు. మీ చేతికి కోటి రూపాయలు వస్తాయి.
- కావాల్సిన సంపద : రూ.1 కోటి
- 15 సంవత్సరాల్లో మీరు మదుపు చేసే మొత్తం : రూ.27,00,000
- రాబడి (15 శాతం వార్షిక అంచనాతో) : రూ.74,52,946
- మొత్తం కార్పస్ : రూ.1,01,52,946
15x15x15 రూల్ పని చేస్తుందా?
15x15x15 రూల్ కచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు, అస్థిరతలు చాలా సహజం. అందువల్ల అన్ని వేళలా మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలు వస్తాయని చెప్పలేము. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులపై మాత్రం కచ్చితంగా లాభాలు సంపాదించవచ్చని చరిత్ర చూస్తే తెలుస్తుంది.