తెలంగాణ

telangana

ETV Bharat / business

సకాలంలో రుణాలు తీర్చకపోతే - బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా? - Unable to repay loan

Legal Actions Against Loan Defaulters In Telugu : ఈ రోజుల్లో బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకోవడం చాలా సాధారణం అయిపోయింది. ఒక వేళ ఈ రుణాలు తీర్చకపోతే, కచ్చితంగా క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. పైగా బ్యాంకులు వేసే సివిల్ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా డిఫాల్టర్లపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయంటే?

Legal Action Against Personal Loan Defaulters
Legal Actions Against Loan Defaulters in India

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 4:21 PM IST

Legal Actions Against Loan Defaulters : బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు గతంలో కంటే ఇప్పుడు చాలా విరివిగా పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. సకాలంలో రుణాలు తీర్చేసేవారికి, తక్కువ వడ్డీతో మరలా లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. ఒకవేళ రుణం ఎగవేస్తే, డిఫాల్టర్లపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. అందుకే వ్యక్తిగత రుణాలు తీసుకోవాలని అనుకునేవారు, డిఫాల్టర్లపై బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో ముందే తెలుసుకోవడం మంచిది.

కోర్టు కేసు తప్పదు
బ్యాంకులు వాహన, గృహ రుణాలను సురక్షితమైనవిగా భావిస్తాయి. ఎందుకంటే, రుణగ్రహీత లోన్ సొమ్మును తిరిగి చెల్లించకపోతే, సదరు వ్యక్తికి సంబంధించిన ఇంటిని లేదా వాహనాన్ని బ్యాంకులు జప్తు చేసుకుంటాయి. కానీ వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీ ఉండదు. కనుక వాటిని అసురక్షిత రుణాలుగా బ్యాంకులు భావిస్తాయి. అందుకే రుణగ్రహీత క్రెడిట్ స్కోర్​ను చూసి​ రుణాలు ఇస్తాయి. ఒకవేళ వాటిని సకాలంలో తీర్చకపోతే, న్యాయస్థానాల్లో కేసులు నమోదు చేస్తాయి. అంతేకాదు డిఫాల్ట్ అయినప్పుడు బ్యాంకులు ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటాయో ఇప్పుడు చూద్దాం.

డిఫాల్ట్​ అయితే?
పర్సనల్​ లోన్​ తీసుకున్న వ్యక్తి సకాలంలో అసలు, వడ్డీలు చెల్లించాలి. ఒకవేళ సకాలంలో చెల్లించకపోయినా, ఎగవేసినా, కోర్ట్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా రుణగ్రహీత క్రెడిట్‌ స్కోర్​ తగ్గుతుంది. దీనివల్ల భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. రుణాలు లభించినా, అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ప్రతి EMI డిఫాల్ట్‌, రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరును 50-70 పాయింట్లు మేరకు తగ్గిస్తుంది. పైగా ఆలస్య రుసుములు, అదనపు జరిమానాలు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ రుణభారాన్ని మరింత పెంచుతాయి. ఫలితంగా రుణగ్రహీత ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.

నిరర్థక ఆస్తిగా
దీర్ఘకాలంపాటు రుణాలు చెల్లించకుండా ఉంటే, బ్యాంకులు లోన్ రికవరీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తాయి. 90 రోజులకు మించి బకాయిలు చెల్లించకపోతే, రుణగ్రహీత ఖాతాను నిరర్థక ఆస్తి(NPA)గా పరిగణిస్తాయి. ఇలా లోన్ అకౌంట్​ను ఎన్‌పీఏగా మార్చిన తర్వాత బ్యాంకులు చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తాయి. కానీ అంతకంటే ముందు లోన్ అమౌంట్ తీర్చేయమని మీకు ముందస్తు నోటిసు పంపుతాయి. ఈ నోటీస్​ అందిన తర్వాత 60 రోజుల్లోపు రుణాన్ని తీర్చేందుకు అవకాశం ఉంటుంది.

కనుక రుణగ్రహీత ఈ గడువులోగా రుణాన్ని తీర్చేస్తానని బ్యాంకును ఒప్పించాలి. అప్పుడు బ్యాంకులు మీకు కాస్త సమయం ఇస్తాయి. పైగా చట్టపరమైన చర్యలను కాస్త వాయిదా వేస్తాయి. ఒక వేళ ఈ 60 రోజుల గడువులోగా రుణం తీర్చకపోతే, బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. పైగా రుణగ్రహీతకు సంబంధించిన ఫిక్స్​డ్​ డిపాజిట్స్ నుంచి, సేవింగ్స్​ అకౌంట్స్​ నుంచి లోన్ సొమ్మును రికవరీ చేసుకుంటాయి.

చట్టపరమైన చర్యలు
బ్యాంకులు చట్టపరమైన చర్యల్లో భాగంగా సివిల్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తాయి. దీనితో కోర్టులు లోన్ సొమ్మును చెల్లించమని, రుణగ్రహీతను ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బకాయి మొత్తాన్ని రికవరీ చేయడానికి రుణగ్రహీతకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించవచ్చు. లేదా అతని ఆస్తులను విక్రయించాలని కూడా కోర్టు ఆదేశించవచ్చు. ఒక వేళ రుణగ్రహీత ఒక ఉద్యోగి అయితే, అతని/ ఆమె జీతం నుంచి నెలనెలా నిర్థిష్ట మొత్తాన్ని బ్యాంకు వసూలు చేసుకోవచ్చని కోర్టులు ఆదేశించవచ్చు.

చెల్లించాల్సిన బకాయిలు రూ.20 లక్షల కంటే ఎక్కువ ఉంటే, ఆర్థిక సంస్థల చట్టం-1993 ప్రకారం, బ్యాంకులు రుణాల రికవరీ కోసం ‘డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌(DRT)ను ఆశ్రయించే అవకాశం ఉంది. బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు, రుణగ్రహీత తప్పనిసరిగా హాజరై డిఫాల్ట్‌కు గల కారణాల్ని వివరించాలి. లేకపోతే, బ్యాంకులు రుణగ్రహీతకు ఉన్న ఆస్తులను విక్రయించి, తమ సొమ్మును రికవరీ చేసుకుంటాయి.

ప్రాథమిక హక్కుల పరిస్థితి ఏమిటి?
రుణ గ్రహీతలు బ్యాంకు రుణాలు తీర్చకపోయినా, అతని ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం ఏర్పడదు. కనుక బ్యాంకులు రికవరీ ప్రక్రియలో ఆర్‌బీఐ రూపొందించిన ఫెయిర్‌ ప్రాక్టీస్‌ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రుణగ్రహీతను బెదిరించడం/ వేధించడం లాంటివి చేయకూడదు. ఒక వేళ చేస్తే, వాటిని న్యాయవ్యవస్థ చట్టవిరుద్ధమైన చర్యలుగా పరిగణిస్తుంది.

వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల కారణంగా, సకాలంలో అప్పులు తీర్చలేకపోతే, కోర్టు దానిని సివిల్ క్రైమ్​గా పరిగణిస్తుంది. కానీ జైలు శిక్ష విధించదు. అయితే ఉద్దేశపూర్వకంగా అప్పులు ఎగ్గొడితే మాత్రం కఠిన శిక్షలు తప్పవు.

డిఫాల్టర్​గా ఉండకూడదంటే?
పర్సనల్ లోన్స్​కు ఎలాంటి హామీ చూపించాల్సిన అవసరం ఉండదు. కనుక అప్పు చెల్లించకపోతే ఏమౌతుందనే ధోరణి పనికిరాదు. ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు. ముఖ్యంగా బ్యాంక్​ లోన్​కు అప్లై చేసే ముందు, మీ ఆదాయం, ఖర్చుల వివరాలతో సరైన బడ్జెట్‌ను తయారుచేసుకోవాలి. రుణ చెల్లింపులకు సరిపడా నిధులను కేటాయించుకోవాలి. ఈఎంఐలతో సహా, ఊహించని ఖర్చులను తట్టుకోవడానికి అత్యవసర నిధిని ఏర్పాటుచేసుకోవాలి.

ఒక వేళ మీకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటే, ముందుగానే మీ బ్యాంకులతో మాట్లాడాలి. వారు మీకు తగిన పరిష్కారం చూపిస్తారు. లేదంటే తక్కువ వడ్డీ రేటు ఉన్న, మీకు అనుకూలమైన రీపేమెంట్ నిబంధనలు ఉన్న బ్యాంకుకు మీ రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు.

జనవరి 22న బ్యాంకులకు సెలవు ఉంటుందా? గవర్నమెంట్​ ఆఫీసుల సంగతేంటి?

LIC 'జీవన్​ ధార 2' పాలసీ లాంఛ్​ - ఈ ప్లాన్​తో జీవితాంతం ఇన్​కం గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details