Walking Mistakes to Avoid: ప్రతి రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కండరాలు బలంగా మారడమే కాకుండా.. కేలరీలు, కొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌ను ఏ వయసు వారైనా, ఎప్పుడైనా మొదలు పెట్టొచ్చని.. అంతే కాకుండా అందరూ చేయగలిగే సులువైన వ్యాయామమని అంటున్నారు. ఫలితంగా చాలా మంది ఉదయాన్నే నడకకు వెళ్తుంటారు. అయితే, ఈ నేపథ్యంలోనే మార్నింగ్ వాకింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఉదయమే ఒక్కసారిగా వేగంగా నడవడం వల్ల కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పుల వంటి ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.
- ముఖ్యంగా మొదటి 5 నిమిషాలు మెల్లగా నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శక్తిని ఉత్పత్తి చేసే రసాయనాలు ప్రేరేపితమై.. నడవడానికి అవసరమైన ఎనర్జీ లభిస్తుందని చెబుతున్నారు.
- వేగంగా నడిచే సమయాన్ని వారానికోసారి 5 నిమిషాలు పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యుక్త వయసులో ఉన్నవారు 40-60 నిమిషాల వరకు నడవచ్చని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మెదడులో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలై ఆందోళన తగ్గుతుందని వివరిస్తున్నారు.
- మెల్లగా 5 నిమిషాలు నడిచిన తర్వాత 30 నిమిషాల సేపు వేగంగా నడవాలని నిపుణులు అంటున్నారు. నడకలో వేగం పెరిగే కొద్దీ కేలరీలు ఖర్చు అవుతాయని వివరిస్తున్నారు. ఫలితంగా బరువు కూడా తగ్గుతారని పేర్కొన్నారు. కండరాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా జరుగుతుందని చెబుతున్నారు.
- ప్రతి రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల శారీరక సామర్థ్యంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇంకా చెమట ద్వారా రక్తంలోని మలినాలు బయటకు పోయి రక్త ప్రసరణ పెరుగుతుందని వివరిస్తున్నారు.
- రోజు సమయం కేటాయించలేని వారు వారానికి 3-4 రోజులైనా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అరగంట నడవలేని వారు 15 నిమిషాల చొప్పున రెండు సార్లు నడిస్తే మంచిదని అంటున్నారు.
- ఇలా క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన గుండె సమస్యలు, డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. 2017లో Journal of the American Heart Association ప్రచురితమైన "Walking and Primary Prevention: A Meta-Analysis of Prospective Cohort Studies" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి తింటే క్యాన్సర్ వచ్చే రిస్క్ తక్కువట- అవేంటో మీకు తెలుసా?
సూది, రక్తం లేకుండానే షుగర్ టెస్ట్! ఈజీగా వాచ్‌తోనే చెక్ చేసుకోవచ్చట!!