HMPV Virus Cases In India : భారత్‌లో కొత్త 'చైనా' వైరస్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇప్పటికే రెండు, గుజరాత్లో ఒక హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వివరాలు వెల్లడించింది.
బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలో చేరిన బ్రోంకోప్ న్యూమోనియా వ్యాధి చరిత్ర కలిగిన ఓ 8నెలల ఆడ శిశువుకు HMPV నిర్ధరణ అయిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆ చిన్నారి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఆమెతో పాటు మరో3నెలల చిన్నారిలో వైరస్ గుర్తించినట్లు తెలిపింది. ఈ చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతోందని చెప్పింది. ఇక అహ్మదాబాద్లో వైరస్ సోకిన మరో చిన్నారికి ప్రస్తుతం చికిత్స అందుతోందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది. శ్వాస సంబంధిత వ్యాధులపై సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ వైరస్ కేసులు గుర్తించినట్లు తెలిపింది.
హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇవే!
హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లాగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3-6 ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్-సీడీసీ ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు ఈ వైరస్ బారినపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట.
చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో ఇప్పటికే భారత్ అలర్ట్ అయింది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్-DGHS అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం-జేఎంజీ కూడా నిర్వహించింది. చలికాలంలో జరుగుతున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది. అయితే, ఈ వైరస్ గురింతి భారత్‌లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.