How To File Income Tax Returns Online :ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే తరుణం వచ్చేసింది. ఉద్యోగం చేస్తూ వేతనం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నవారు, ఆడిట్ పరిధిలోకి రానివారు కూడా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిందే. ఇందుకోసం జులై 31 వరకు గడువు ఉంది. అయినప్పటికీ ముందుగానే ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది.
ఐటీ శాఖ ఇటీవలి కాలంలో ఆదాయ పన్ను రిటర్నులను మరింత సులభతరం చేస్తూ అనేక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 2024-25 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగులు ఏం చేయాలి?
ఉద్యోగులు, తమ యాజమాన్యాల నుంచి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వివరాలతో ఫారం 16, ఫారం 26ఏఎస్లను తీసుకోవాలి. అలాగే ఇన్కం ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్లి మీ ఆదాయ వివరాలతో వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) డౌన్లోడ్ చేసుకోవాలి. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ 3 పత్రాలు అత్యంత కీలకమని మీరు గుర్తుంచుకోవాలి.
సరైన ఫారం ఎంచుకోవాలి!
ఐటీఆర్దాఖలు చేసేటప్పుడు సరైన ఫారాన్ని ఎంచుకోవడం తప్పనిసరి. పొరపాటున వేరే ఫారాన్ని ఎంచుకుంటే, ఆదాయ పన్ను శాఖ దానిని డిఫెక్టివ్ రిటర్నుగా పరిగణిస్తుంది. ఫలితంగా మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) నోటిఫై చేసిన ఫారాల్లో మీకు సరిపడే ఫారాన్ని ఎంచుకోవాలి.
ఆదాయం, నివాస స్థితి, వ్యాపారం మొదలైనవాటి ఆధారంగా ఈ ఫారాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం 7 ఫారాలు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన దానిని ఎంచుకోవాలి.
- ఐటీఆర్ 1 (సహజ్) : ఇది చాలా సరళమైనది. రూ.50 లక్షల లోపు వేతనం, ఒకే ఇంటిపై ఆదాయం, వడ్డీ రూపంలో ఆదాయం అందుకుంటున్నవాళ్లు ఈ ఫారాన్ని ఎంచుకోవాలి.
- ఐటీఆర్ 2 :రూ.50 లక్షలకు మించి ఆదాయం, మూలధన లాభాలు, వ్యాపార ఆదాయం, విదేశాల నుంచి ఆదాయం, ఒకటి కంటే ఎక్కువ ఇళ్ల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఈ ఫారాన్ని తీసుకోవాలి.
- ఐటీఆర్ 3 :హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్)లకు చెంది ఉండి, వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించే వారు ఈ ఫారాన్ని తీసుకోవాలి.
పాత, కొత్త పద్ధతుల్లో!
ఐటీ రిటర్నులను ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మీరు ఎలాంటి మినహాయింపులు వద్దు అనుకుంటే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. మినహాయింపులతోపాటు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలని అనుకుంటే పాత పన్ను విధానంలోనే కొనసాగవచ్చు. మీకు ఏ విధానం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్వారు అందిస్తున్న కాలిక్యులేటర్ను ఉపయోగించుకోవచ్చు.