Hindenburg Allegations Against SEBI Chairperson :మెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్ ఆరోపించారు. త్వరలోనే తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామని వెల్లడించారు. తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లో చేసిన ఆర్థిక కార్యకలాపాల వివరాలను కూడా అధికారులకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు మాధబి దంపతులు ఓ సంయుక్త ప్రకటన జారీ చేశారు.
"మా జీవితం తెరిచిన పుస్తకం. ఇప్పటికే కొన్నేళ్లుగా అన్ని రకాల వివరాలను మేం సెబీకి సమర్పించాం. ఏ శాఖ అధికారులు కోరినా, మేం ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లోని ఏ ఆర్థిక కార్యకలాపాల వివరాలు వెల్లడించేందుకైనా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రానున్న రోజుల్లో మా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర ప్రకటన జారీ చేస్తాం’’ అని ఆ ప్రకటనలో మాధబి, ధావల్ బచ్ పేర్కొన్నారు.
హిండెన్‌బర్గ్ మానిప్యులేట్ చేస్తోంది - అదానీ గ్రూప్
హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు చాలా హానికరమైన (మలీసియెస్), మానిప్యులేటివ్‌గా ఉన్నాయని దుయ్యబట్టింది. సెబీ ఛైర్‌పర్సన్‌తో, ఆమె భర్తతో తమకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని పేర్కొంది.
కారణం అదే!
"హిండెన్‌బర్గ్‌పై సెబీ చర్యలు తీసుకొని షోకాజు నోటీసు జారీ చేసింది. దానికి ప్రతిస్పందనగా ఆ సంస్థ మా వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తోంది. ఇది దురదృష్టకరం" అని మాధబి దంపతులు ఆరోపించారు.
హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్‌లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్, ఆఫ్‌షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది.
'నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించాం. సెబీ ఛైర్‌పర్సన్ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను చూస్తే ఇది బాగా అర్థం అవుతుంది. విజిల్‌బ్లోయర్ పత్రాల ప్రకారం, గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్‌లు ఉన్నాయి. ఇందులో మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్‌లకు వాటాలు ఉన్నాయి' అని హిండెన్‌బర్గ్ తన తాజా నివేదికలో ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.83 కోట్ల) వరకు ఉండొచ్చని తెలిపింది. అయితే హిండెన్‌బర్గ్ వ్యాఖ్యలపై సెబీ ఇంకా స్పందించలేదు.
గతంలోనూ
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసింది. దానిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజాగా శనివారం ఉదయం తన ‘ఎక్స్’ ఖాతాలో ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది. దీంతో భారత (India) మార్కెట్లలో మరో బాంబు పేల్చనుందా? అని నెట్టింట్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పూరీ బచ్, ఆమె భర్తపై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ సంస్థల విదేశీ ఫండ్లలో వీరిద్దరికీ వాటాలున్నట్లు హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది.
మీ లోన్, క్రెడిట్ కార్డు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిందా? ఇవే కారణాలేమో చెక్ చేసుకోండి! - Reasons For Credit Card Rejection
స్టార్టప్‌లకు ఆశాకిరణాలు ఏంజెల్ ఇన్వెస్టర్స్- దేశంలో ప్రముఖ నెట్‌వర్క్‌లు ఇవే! - Angel Networks In India