Stock Market Close Today November 4, 2024 :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 942 పాయింట్లు పతనమై మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయి 24,000 దిగువన ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంక్ షేర్స్ భారీగా నష్టపోవడమే ఇందుకు కారణం.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 941 పాయింట్లు నష్టపోయి 78,782 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 309 పాయింట్లు కోల్పోయి 23,995 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు :ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్
- నష్టపోయిన షేర్లు :అదానీ పోర్ట్స్, రిలయన్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, టైటాన్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఐటీసీ
నష్టాలకు కారణాలు ఇవే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్ సూచీలపై పడింది. పైగా ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు వేచి చూడడమే బెటర్ అనే ధోరణిలో ఉన్నారు. ఇది కూడా స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీసింది.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. దీని వల్ల ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి పెంచడానికి ఏమాత్రం సుముఖంగా లేవు. ఇది కూడా స్టాక్ మార్కెట్లపై పరోక్షంగా ప్రభావం చూపించింది. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 2.57 శాతం పెరిగింది. దీనితో బ్యారెల్ ముడిచమురు ధర 74.98 డాలర్లకు చేరింది.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.211.93 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. వాస్తవానికి అక్టోబర్ నెల మొత్తాన్ని తీసుకుంటే ఎఫ్ఐఐలు ఏకంగా రూ.94,000 కోట్ల వరకు తమ పెట్టుబడులను దేశం నుంచి ఉపసంహరించుకున్నారు. చైనా స్టాక్ మార్కెట్లో రాబడికి మంచి అవకాశాలు ఉండడమే ఇందుకు కారణం.
రూపాయి విలువ
సోమవారం రూపాయి విలువ భారీగా పతనమై జీవితకాల కనిష్ఠాల వద్ద ముగిసింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.11గా ఉంది. దీని వల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ మరింత పతనం అవుతోంది. ఇది నేరుగా భారత విదేశీ కరెన్సీ రిజర్వ్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.