Domicile Treatment Benefits :ఆసుపత్రిలో అయ్యే వైద్య ఖర్చులను మాత్రమే కాదు డే-కేర్ ట్రీట్‌మెంట్స్, ఆయుష్ ప్రయోజనాలు, మానసిక ఆరోగ్య సంరక్షణ లాంటి వాటిని కూడా ఆరోగ్య బీమా పాలసీ కవర్ చేస్తుంది. అయితే ఆరోగ్య బీమా పాలసీ అందించే మరో ముఖ్యమైన ప్రయోజనమే 'డొమిసిలియరీ హాస్పిటలైజేషన్'.
డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి?
What Is Domiciliary Hospitalization :ప్రతికూల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పేషెంట్ ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకోలేనప్పుడు లేదా పాలసీదారుడు ఇంట్లోనే చికిత్స పొందాలని డాక్టర్లు సూచించినప్పుడు మన ఇంటికి వచ్చి వైద్యులు చేసే వైద్య చికిత్సనే 'డొమిసిలియరీ హాస్పిటలైజేషన్'. ఇది ఆరోగ్య బీమా అందించే ముఖ్యమైన కవరేజ్ ప్రయోజనాల్లో ఒకటి.
వీరికి ప్రయోజనం
Benefits Of Domiciliary Hospitalization :దీర్ఘకాలికంగా అనారోగ్యం బారిన పడి మంచానికే పరిమితమైన రోగికి నిరంతరం వైద్య సంరక్షణ చాలా అవసరం. కానీ, అలాంటివారు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల ఆసుపత్రి గది, బెడ్ అద్దె ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఒకవేళ ఆరోగ్య బీమా ఉన్నా కూడా దీని కింద వచ్చే కవరేజ్ డబ్బులు ఏ మాత్రం సరిపోకపోవచ్చు. లేదంటే రోగి ఆర్థిక పరిస్థితులు ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండడానికి వీలు కల్పించకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో 'డొమిసిలియరీ హాస్పిటలైజేషన్' పద్ధతితో రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే అవసరమైన వైద్య చికిత్సను పొందవచ్చు. ఆసుపత్రిలో చేరడం సౌకర్యంగా లేని రోగులకు కూడా ఈ ట్రీట్మెంట్ 'ఫ్రం హోం' లేదా 'డొమిసిలియరీ హాస్పిటలైజేషన్' కవరేజీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కవరేజీలో నర్సింగ్ కేర్, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఇంటిలో రోగికి చికిత్స కోసం అవసరమైన మందులు లాంటి వైద్య ఖర్చులు కవర్ అవుతాయి.
ఇలా పనిచేస్తుంది
వైద్యుడిని సంప్రదించిన తర్వాత రోగి వైద్య చికిత్సకు అవసరమయ్యే విధానాలను/పద్ధతులను డాక్టర్ అంచనా వేస్తారు. అతడి పరిస్థితికి సంబంధించిన స్వభావం, తీవ్రత ఆధారంగా రోగి డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌కు అర్హుడా కాదా అనే దానిని డాక్టర్ నిర్ణయిస్తారు. ఇంటి వద్దే చికిత్స అవసరమని భావిస్తే రోగికి చికిత్సలో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లు, నెబ్యులైజర్లు మొదలైన అవసరమైన వైద్య పరికరాలను ఇంటి వద్ద అమర్చుతారు. అవసరమైతే ఒక నర్సు లేదా సంరక్షకుడిని ఆసుపత్రి నియమిస్తుంది. వారు రోగి ఇంటి వద్ద ఉండి అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తూ, పేషెంట్‌కు సంబంధించిన హెల్త్ కండీషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఈ నివేదికను సంబంధిత వైద్యుడికి తెలియజేస్తారు. ఒకవేళ చికిత్స పూర్తయితే తదుపరి కార్యచరణ లేదా ఫాలో-అప్ కోసం రోగి వైద్యుడిని సంప్రదిస్తారు.
ఇవి బెనిఫిట్స్
- డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌తో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న అంశం.
- ఆసుపత్రి గది అద్దెలు ఈ రకమైన కవరేజీలో ఉండవు.
- రోగి వారి సొంతింటిలో సౌకర్యవంతంగా ట్రీట్మెంట్ను పొందవచ్చు.
- ప్రత్యేకంగా తరచూ కదులుతూ ఉంటే ఇబ్బంది పడేవారికి లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ సౌకర్యం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతాం గనుక సొంత కుటుంబ సభ్యుల తోడ్పాటుతో పాటు వారి పలకరింపుల ద్వారా రోగి వేగంగా కొలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- అంతేకాకుండా ఆసుపత్రిలో సహజంగా ఉండే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం.
- ఇంట్లోని పరిశుభ్రమైన వాతావరణం రోగిని త్వరగా కోలుకునేలా చేస్తుంది.
- క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్, రీయింబర్స్‌మెంట్ రెండింటికీ సంబంధించిన క్లెయిం ప్రాసెస్ ఈ బీమాలో ఉంటుంది.
ఇవి మినహాయింపులు
- డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ బీమా పాలసీని తీసుకునే ముందు ఉన్న అనారోగ్యాలను కవర్ చేయకపోవచ్చు.
- వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.
- ప్రయోగాత్మక లేదా నిరూపితం కాని వైద్య చికిత్సలు డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ కవరేజ్ కింద మినహాయింపులకు లోబడి ఉండవచ్చు.
- కాస్మెటిక్ సర్జరీ, వంధ్యత్వ చికిత్సలు, బరువు తగ్గించే శస్త్ర చికిత్స లాంటి అనేక వైద్య విధానాలు, చికిత్సలు సాధారణంగా ఇందులో కవర్ అవ్వవు.
- అంతేకాకుండా దేశం బయట పొందిన ఏదైనా వైద్య చికిత్సలకు కూడా రీయింబర్స్‌మెంట్ ఉండదు.
- ఆమోదం లేని ప్రిస్క్రిప్షన్ ఔషధాలకు ఈ కవరేజ్ నుంచి మినహాయింపు ఉంటుంది.
- ఉద్దేశపూర్వకంగా చేసుకున్న గాయాలను డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ కవర్ చేయదు.
- మాదకద్రవ్య దుర్వినియోగం లేదా వ్యసనానికి సంబంధించిన చికిత్స కోసం కవరేజీని అందించకపోవచ్చు.
- మానసిక అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు కూడా కవరేజ్ ఉండదు.
- బ్రాంకైటిస్, మూర్చ రోగం, అస్తమా, దగ్గు, జలుబు లేదా ఇన్‌ఫ్లూయెంజా, డయాబెటీస్, దీర్ఘకాలిక నెఫ్రిటిస్, విరేచనాలు, గ్యాస్ట్రో-ఎంటెరిటీస్, కీళ్లనొప్పులు, రుమాటిజం, రక్తపోటు, టాన్సిలిటిస్ మొదలైన రోగాలకు డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ కవరేజ్ వర్తించదు.
- ఆయుర్వేదం, హోమియోపతి చికిత్సలకు కూడా కవరేజ్ ఉండదు.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
చికిత్సకు సిద్ధమయిన ప్రతి రోగికీ డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ సాధ్యం కాదు. రోగి ఆసుపత్రిలో బెడ్‌ను పొందలేకపోయాడని లేదా అలాంటి పరిస్థితులు లేవని రోగి బీమా సంస్థకు నిరూపించగలగాలి. అర్హత ఉన్న రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపీ) డాక్టర్ ద్వారా రాతపూర్వకంగా సిఫార్సు చేయించాలి.
- కరోనా కవచ్ మెడికల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన చికిత్సను ఇది కవర్ చేస్తుంది.
- డొమిసిలియరీ చికిత్సను పొందేందుకు, బీమా పొందిన వ్యక్తి కనీసం మూడు రోజుల పాటు ఇంట్లోనే చికిత్స పొందాల్సి ఉంటుంది.
- అయితే ఈ బీమా సౌకర్యం అన్ని బీమా సంస్థలు సమగ్ర కవరేజీలో భాగంగా ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు అదనపు ప్రీమియంతో రైడర్‌గా తీసుకోవాలి.
- ఖర్చులను క్లెయిమ్ చేస్తున్నప్పుడు, అవసరమైన అన్ని చికిత్స బిల్లులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.
మార్చి డెడ్‌లైన్స్ - గడువులోగా ఈ పనులన్నీ కంప్లీట్ చేయాల్సిందే!
అలర్ట్ - త్వరలో బంగారం ధర రూ.70వేలకు పెరిగే ఛాన్స్ - కారణం ఏమిటంటే?