New EPFO Feature : మీరు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులా? అయితే మీకోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈపీఎఫ్ఓ సభ్యులుగా ఉన్న ఉద్యోగులంతా తమ పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఇక నుంచి కంపెనీ వెరిఫికేషన్ లేకుండానే ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఈ-కేవైసీ పీఎఫ్ అకౌంట్లు కలిగిన వారంతా తమ ప్రస్తుత కంపెనీ ఆమోదం లేకుండానే, ఆధార్ ఓటీపీ ద్వారా నూతన కంపెనీకి ఈపీఎఫ్ ఖాతా బదిలీకి దరఖాస్తును సమర్పించొచ్చు. ఈపీఎఫ్ఓకు సభ్యుల నుంచి అందుతున్న వినతుల్లో 27 శాతం వారి ప్రొఫైల్/కేవైసీ అంశాలతో ముడిపడినవే అని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ చెప్పారు. ఈ కొత్త ఫీచర్ల వల్ల ఈపీఎఫ్ఓకు వచ్చే వినతులు చాలా వరకు తగ్గిపోతాయని ఆయన అన్నారు.
"ఈపీఎఫ్ఓ సభ్యులు కంపెనీ ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా తన వ్యక్తిగత సమాచారాన్ని మార్చుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి వెళ్లి పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లిదండ్రుల పేర్లు, వివాహ స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగాన్ని వదిలిన తేదీ వంటివన్నీ మార్చుకోవచ్చు" అని మనుసుఖ్ మాండవీయ వివరించారు. ఇంతకు ముందు చాలా కంపెనీలు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో సభ్యుల వ్యక్తిగత వివరాల నమోదులో తప్పులు చేసేవి. పర్యవసానంగా ఈపీఎఫ్ఓ సభ్యులు సంబంధిత డాక్యుమెంట్లను జతపర్చి, ఆయా తప్పులను సరిచేయాలంటూ కంపెనీలకు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ దరఖాస్తులను కంపెనీలు పరిశీలించి, ఈపీఎఫ్‌ఓ విభాగం వద్దకు పంపేవి. ఇక ఈ ఇబ్బంది ఉండదు. నేరుగా పీఎఫ్ అకౌంటు కలిగిన సభ్యుడే ఆ సవరణలన్నీ చేసుకోవచ్చు.
కొత్త ఫీచర్ ఎవరి కోసం?
- 2017 అక్టోబరు 1 తర్వాత యూఏఎన్ అకౌంటు నంబరు జారీ అయిన ఈపీఎఫ్ఓ సభ్యులకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వీరు ఎలాంటి డాక్యుమెంట్లు, ధ్రువపత్రాలను సమర్పించకుండానే వ్యక్తిగత వివరాలను మార్చుకోవచ్చు.
- 2017 అక్టోబరు 1 కంటే ముందే యూఏఎన్ పొందిన వారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను కంపెనీయే నేరుగా ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మార్చేయొచ్చు. ఈ క్రమంలో సమర్పించాల్సిన ధ్రువపత్రాల అవసరాన్ని చాలా వరకు సరళీకరించారు.
- ఎవరైనా ఈపీఎఫ్ఓ సభ్యుడి యూఏఎన్, ఆధార్ కార్డుతో లింక్ అయి లేకుంటే, నేరుగా కంపెనీయే ఆయా సమాచారాన్ని మార్చొచ్చు. అనంతరం ఆ వివరాలను ఈపీఎఫ్ఓ పరిశీలనకు పంపాలి.
కంపెనీలకు ఉద్యోగుల వినతులు- జాప్యంతో ఈపీఎఫ్‌ఓకు గ్రీవెన్స్‌లు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓకు దాదాపు 8 లక్షలకుపైగా వినతులు అందాయి. వివిధ రకాల సవరణలు చేయాలని కోరుతూ ఉద్యోగులు తమ కంపెనీకి దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ఎంతకూ వాటిపై సరైన స్పందన రాకపోడం వల్ల చాలా మంది ఈపీఎఫ్‌ఓకు వినతులు పంపారు. కంపెనీకి దరఖాస్తు ఇచ్చి 10 రోజులు గడిచినా స్పందన రాకపోవడం వల్ల ఈపీఎఫ్‌ఓకు వినతులు పంపినవారు దాదాపు 47 శాతం మంది ఉన్నారు. మరో 40 శాతం మంది తమ కంపెనీకి దరఖాస్తు ఇచ్చిన ఐదు రోజుల్లోనే ఈపీఎఫ్‌ఓకు వినతులు పంపారు. దీన్నిబట్టి పీఎఫ్ అంశంలో ఉద్యోగులు పెట్టుకునే దరఖాస్తులపై కంపెనీల స్పందన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపై ఉద్యోగులు ఇంతటి జాప్యాన్ని ఎదుర్కోకుండా కొత్త ఫీచర్లు మార్గాన్ని సుగమం చేస్తాయి. వీటి ప్రకారం ఉద్యోగికి సంబంధించిన చాలా పీఎఫ్ వివరాలను ఆధార్ ఓటీపీతో కంపెనీలు వెంటనే మార్చగలవు. జనవరి 18 నాటికి దేశంలోని కంపెనీల వద్ద ఉద్యోగులకు సంబంధించిన దాదాపు 3.9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంకింగ్ రంగం తరహాలో జవాబుదారీగా ఈపీఎఫ్ఓ వ్యవస్థను సమూలంగా సంస్కరించే దిశగా కేంద్ర సర్కారు అడుగులు వేస్తోంది.