Favourite Things Leaves at kashi : హిందువులకు ఆధ్యాత్మికంగా చివరి మజిలీ కాశీ పట్టణం. మరణించేలోపు ఒక్కసారైనా కాశీ వెళ్లాలని కోరుకునేవారు ఎందరో ఉంటారు. కాశీలోని మరణించాలని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వాళ్లు కూడా ఎందరో ఉంటారు. ఇలా కాశీ గురించి ఎన్నో ఆసక్తి గొలిపే అంశాలు ఉన్నాయి. అందుకే కాశీకి వెళ్లిన వాళ్లు ఆచరించాల్సిన ఒక ముఖ్యమైన నియమం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
కాశీనామ్ మరణం ముక్తి
శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం ప్రకారం కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుందని అంటారు. అందుకోసం జీవితపు చివరి దశలో కాశీకి వెళ్లి అక్కడే నివసించేవారు ఎందరో ఉన్నారు. అలాగే కాశీ యాత్రకు వెళ్లినప్పుడు అక్కడ మనకు ఇష్టమైనది విడిచి పెట్టాలని అంటారు. అంటే ఆహారంలో మనకు ఇష్టమైన 'పండు' లేదా 'కూరగాయ' అని అర్ధం.
అసలు మర్మం
కాశీకి వెళ్తే కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు. అందులో మర్మమేమిటి? అసలు శాస్త్రంలో ఎక్కడ కూడా కాశీకి వెళితే కాయ లేదా పండు వదిలేయాలని చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసీతెలియక పాటిస్తున్నారు.
శాస్త్రం ఏమి చెబుతోందంటే!
కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి 'కాయో పేక్షో' గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వెళ్లాలి అని శాస్త్రం చెబుతోంది.
అసలైన పరమార్ధం ఇదే!
ఇక్కడ 'కాయో పేక్ష' అంటే కాయం అంటే శరీరం. ఈ శరీరంపై మమకారం విడిచి పెట్టి భగవంతుని వైపు ప్రయాణం చేయాలని అర్థం. అలాగే 'ఫలాపేక్ష' అంటే మనం చేసే కర్మఫలంపై ఆపేక్ష విడిచి పెట్టాలని అర్థం. అంటే ఏ పని చేసినా భగవంతునికి అర్పించినట్లుగా, ప్రతి ఫలాపేక్ష లేకుండా చేయాలని, చేసిన కర్మ ఫలితంపై ఆపేక్ష పెంచుకోకూడదని అర్థం. అంటే చితిలో కాలిపోయే ఈ కాయం అంటే శరీరంపై కోరికను, కర్మఫలంపై ఆశను, మమకారాన్ని పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.
కాలగమనంలో మారిన అర్థం
కాలక్రమేణా జన వ్యవహారంలో ఇది కాస్త కాయ లేదా పండుగా మారిపోయింది అంతేగాని కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే పుణ్యం ఏమి ఉంటుంది చెప్పండి?
శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అది అర్థం చేసుకుని ఆ క్షేత్ర దర్శనం చేసేటప్పుడు ఆ సాంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. అంతేగాని మామిడిపండుని, వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అందుకే కాశీకి వెళితే మనకి శత్రువులైన ఈ శరీరంపై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల ఫలం మీద కోరికని మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం పొందడమే పరమార్థంగా భావించాలి. ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.