తెలంగాణ

telangana

ETV Bharat / business

దీపావళి షాపింగ్ చేయాలా? ఈ 6 స్మార్ట్‌ టిప్స్‌తో - బోలెడు డబ్బులు ఆదా చేసుకోండిలా! - DIWALI SHOPPING HACKS

దీపావళి షాపింగ్ టిప్స్‌ - డిస్కౌంట్స్‌, క్యాష్‌బ్యాక్స్‌, బ్యాంక్ ఆఫర్స్‌ తెలివిగా వాడుకోండి ఇలా!

Shopping Hacks
Shopping Hacks (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 3:23 PM IST

Diwali Shopping Hacks :దీపావళి ఒక కలర్‌ఫుల్ పండుగ. దీపాల కాంతులతో మెరిసిపోయే పండువ. ఇంటిల్లపాదీ కొత్త దుస్తులు ధరించి, స్వీట్స్ పంచుకుని, టపాసులు కాలుస్తూ ఆనందించే వేడుక. అందుకే దీపావళి వచ్చిందంటే చాలు, చాలా మంది భారీ ఎత్తున షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇందుకోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని స్మార్ట్ టిప్స్ పాటిస్తే, ఈ షాపింగ్ బిల్లులను భారీగా తగ్గించుకోవచ్చు. ఇవి వినడానికి చాలా సిల్లీగానే ఉంటాయి కానీ, వీటిని పాటిస్తే, ప్రాక్టికల్‌గా చాలా డబ్బులు ఆదా అవుతాయి. మరెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం రండి.

  1. బడ్జెట్ : దీపావళి షాపింగ్ కోసం ముందుగా ఒక పక్కా బడ్జెట్ వేసుకోవాలి. అప్పుడే అనవసర ఖర్చులు బాగా తగ్గుతాయి. ఎలాంటి ప్రణాళిక లేకుండా షాపింగ్‌కు వెళ్తే, భారీగా అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. షాపింగ్ చేసేటప్పుడు అత్యవసరమైనవి మాత్రమే కొనుగోలు చేయాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు, షాపు వాళ్లు కొంత మేర డిస్కౌంట్ ఇస్తారు. కనుక ఇంటికి అవసరమైనవన్నీ కిరాణా సామగ్రి, స్వీట్స్‌, టపాసులు, దుస్తులు మొదలైనవి ఒకేసారి కొనుగోలు చేయడం మంచిది. పైగా ఇది పండుగ సీజన్. కనుక షాపు వాళ్లు ఇచ్చే పండుగ డిస్కౌంట్లను కూడా వాడుకోవాలి. అయితే డిస్కౌంట్ల కోసం అనవసరపు వస్తువులు కొనకూడదు. వీలైనంత వరకు జల్సా ఖర్చులు తగ్గించుకోవాలి.
  2. క్యాష్‌బ్యాక్స్‌ : పండుగ సీజన్లో కచ్చితంగా క్యాష్‌బ్యాక్ ప్లాట్‌ఫారమ్స్‌ను ఉపయోగించుకోవాలి. ఇవి ఆన్‌లైన్ షాపింగ్‌ ఆఫర్స్, డిస్కౌంట్స్‌, క్యాష్‌బ్యాక్స్‌, కూపన్స్ అందిస్తూ ఉంటాయి. వీటిని వాడుకుంటే, చాలా వరకు డబ్బులు ఆదా అవుతాయి. పైగా ఈ క్యాష్‌బ్యాక్ పాయింట్స్‌ను మరోసారి షాపింగ్ చేసేటప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద వచ్చిన డబ్బులను మీ బ్యాంక్ అకౌంట్‌కు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
  3. కంపేర్ ప్రైస్‌ :ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు, మీకు కావాల్సిన ప్రొడక్ట్ ధరను వివిధ వెబ్‌సైటుల్లో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒక వస్తువు ధర - అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, బిగ్‌బాస్కెట్‌, జెప్టో లాంటి వివిధ ఈ-కామర్స్‌ సైటుల్లో ఎలా ఉందో చూడాలి. అలాగే 'ప్రైస్‌ ట్రాకింగ్ టూల్స్‌' కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడే మీరు సరైన ధరకు వస్తు, సేవలు కొనగలుగుతారు.
  4. డిస్కౌంట్స్‌ : ఈ-కామర్స్ సైట్లు వినియోగదారులకు ఆకర్షించేందుకు అనేక ట్రిక్స్ వాడుతూ ఉంటాయి. వస్తువుల ధరను అమాంతం పెంచేసి, వాటిపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నామని ప్రకటనలు చేస్తుంటాయి. అందుకే కొన్ని నెలలుగా ఆ ప్రొడక్టు ధర ఎంత ఉందో ప్రైస్‌ ట్రాకింగ్ టూల్స్‌ ఉపయోగించి చూడాలి. నిజంగానే మంచి డిస్కౌంట్ ఇచ్చిన ప్రొడక్టును మాత్రమే కొనుగోలు చేయాలి. లేకుంటే నష్టపోవడం ఖాయం.
  5. బ్యాంక్ ఆఫర్స్‌ :చాలా బ్యాంకులు, ఆన్‌లైన్ రిటైలర్స్‌తో కొలాబరేట్ అవుతుంటాయి. తమ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి వస్తు, సేవలు కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌లు అందిస్తూ ఉంటాయి. ఉదాహరణకు అమెజాన్‌తో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీలకు టయ్యప్‌ ఉంది. కనుక ఈ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో వస్తు, సేవలు కొనుగోలు చేసినవారికి డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్లు లాంటివి అందిస్తూ ఉంటారు. అలాగే రివార్డ్స్‌, ఎయిర్ మైల్స్‌ కూడా ఆఫర్ చేస్తుంటారు. అయితే వీటి కోసం మాత్రమే మీరు షాపింగ్ చేస్తే, తరువాత ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోతే, లేట్ పేమెంట్ ఫీజు, కన్వీనియెన్స్ ఫీజు సహా, అధిక వడ్డీ వసూలు చేస్తారు. పైగా మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది.
  6. నో-కాస్ట్‌ ఈఎంఐ :పండగ సమయాల్లో బ్యాంకులు నో-కాస్ట్ ఈఎంఐ, బై నౌ పే లేటర్‌ (BNPL) లాంటి లోన్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి. ఇవి వాడుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ తరువాతే అసలు పిక్చర్ కనిపిస్తుంది. ఇన్‌స్టాల్‌మెంట్స్ సరిగ్గా కట్టకపోతే వడ్డీల మీద వడ్డీలు, అపరాధ రుసుములు లాంటి పడుతూ ఉంటాయి. దీనితో మీపై మోయలేనంత ఆర్థిక భారం పడుతుంది. కనుక పండుగల సమయాల్లో షాపింగ్ చేసేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవడం మంచిది.

నోట్‌ :ఆ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details