Vande Bharat Kavach System Trail : రైళ్లు పరస్పరం ఢీకొట్టకుండా ఉండేందుకు భారత్‌లోనే రూపొందించిన యాంటీ కొలిజన్ డివైస్ కవచ్‌ను రైల్వే అధికారులు వందేభారత్ ట్రైన్‌పై విజయవంతంగా పరీక్షించారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌వో) సంస్థ రూపొందించింన ఈ కవచ్ వ్యవస్థను 8 బోగీలున్న వందేభారత్ రైలుపై శుక్రవారం తొలిసారి పరీక్ష జరిపారు అధికారులు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్ మధ్య తాజా పరీక్ష జరిగిందని అధికారులు తెలిపారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న వందేభారత్ రైలుకు ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసిందని తెలిపారు. "మొదటి ట్రయిల్‌లో లోకో పైలట్ బ్రేకులు వేయలేదు. అయినా అందులోని కవచ్ వ్యవస్థ రెడ్ సిగ్నల్‌ను గుర్తించి బ్రేకులు వేసింది. సిగ్నల్‌కు 10 మీటర్ల దూరంలో రైలును ఆపేసింది. ఈ ప్రయోగం ఆధారంగా దేశవ్యాప్తంగా 8 బోగీలున్న వందేభారత్ రైళ్లలోని కవచ్ వ్యవస్థకు ప్రమాణాలను ఖరారు చేయనున్నాం" అని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.
త్వరలోనే 16 బోగీల వందేభారత్‌పై ట్రయిల్
ఈ వ్యవస్థకు స్టేషన్ కవచ్, పట్టాల వెంబడి ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు, కవచ్ టవర్లు అవసరం. వీటిని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే 16 బోగీలున్న వందేభారత్ రైళ్లపై కవచ్ వ్యవస్థను పరీక్షించనున్నట్లు ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ డిప్యూటీ చీఫ్ సిగ్నల్ ఇంజనీర్ కుష్ గుప్తా పర్యవేక్షణలో ఈ ట్రయిల్ చేపట్టినట్లు వెల్లడించారు.
మెయిల్, ఎక్స్‌ప్రెస్‌పై కూడా
అంతకుముందు కుష్ గుప్తా పర్యవేక్షణలోనే ఆగ్రా డివిజన్లో 140 కి.మీ-160 కి.మీ వేగంతో వస్తున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపై కవచ్‌ను విజయవంతంగా పరీక్షించారు రైల్వే అధికారులు. ఆగ్రా డివిజన్లో 80 కి.మీ విస్తీర్ణంలో కవచ్ నెట్‌వర్క్‌ను విస్తరించింది రైల్వే శాఖ. ఈ ప్రాంతంలో రైళ్లు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లగలవు. మిగతా ప్రాంతాల్లో 130 కి.మీ వేగంతో రైళ్లు నడుస్తాయి.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని కొన్ని రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. కవచ్ అధిక భద్రతతో కూడిన ఇంటిగ్రెటీ లెవల్- 4 ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ కలిగి ఉందని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఇండియన్ రైల్వే చేపట్టిన కవచ్ ఒక ముందడుగు అని వెల్లడించారు.