Global English Proficiency Report Pearson : ఇంగ్లిష్ భాషను సక్రమంగా మాట్లాడే విషయంలో మన దేశంలోని రాష్ట్రాలు ఎక్కడున్నాయి? ఇతర దేశాల సంగతేంటి? అనే అంశాలపై పియర్సన్ సంస్థ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా వెర్సంట్ అనే ప్రత్యేక టూల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో దాదాపు 7.50 లక్షల ఇంగ్లిష్ స్కిల్ టెస్టులను నిర్వహించింది. ఆయా దేశాల ప్రజల ఆంగ్ల భాషా నైపుణ్యాలను అంచనా వేసే ప్రయత్నం చేసింది. ఈ విధంగా సేకరించిన వివరాలతో ది పియర్సన్ గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ రిపోర్ట్ 2024 నివేదికను సోమవారం విడుదల చేసింది. ఇందులో భారత్, జపాన్, ఈజిప్ట్, కొలంబియా, ఫిలిప్పీన్స్, యూరప్ దేశాల ప్రజల ఆంగ్ల భాషా నైపుణ్యాలతో ముడిపడిన ఆసక్తికర సమాచారాన్ని పొందుపర్చింది.
దిల్లీ తర్వాత ఆ రాష్ట్రాలే!
పియర్సన్ నివేదిక ప్రకారం ఇంగ్లిష్‌ను మాట్లాడే విషయంలో మన దేశంలో నంబర్ 1 స్థానంలో దేశ రాజధాని దిల్లీ ప్రాంతం ఉంది. ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే ఎక్కువ శాతంలో దిల్లీ ప్రజలు ఆంగ్లంలో సక్రమంగా సంభాషిస్తున్నారు. దిల్లీ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇంగ్లిష్ మాట్లాడే నైపుణ్యాల విషయంలో ప్రపంచవ్యాప్త సగటు మార్కులు 54 ఉండగా, ఈ విభాగంలో భారత దేశానికి అత్యధికంగా 57 మార్కులు వచ్చాయి.
ఇంగ్లిష్ భాషను రాసే నైపుణ్యాలపరంగా భారత్‌కు సగటున 61 మార్కులను అధ్యయనంలో కేటాయించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు కూడా అంతే (61 మార్కులే) ఉంది. ఇంగ్లిష్ రాసే స్కోరు విషయంలో దిల్లీకి అత్యధికంగా 63 మార్కులు, రాజస్థాన్‌కు 60 మార్కులు, పంజాబ్‌కు 58 మార్కులు పడ్డాయి. మొత్తం మీద ఇంగ్లిష్ భాషా నైపుణ్యాల స్కోరుకు సంబంధించిన ప్రత్యేక కేటగిరీని కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. అందులో మన దేశానికి 52 మార్కులను పియర్సన్ సంస్థ ఇచ్చింది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు మార్కులు భారత్ కంటే కొంచెం మెరుగ్గా 57 మార్కులుగా ఉన్నాయి.
రంగాలవారీగా ఇలా!
ఇంగ్లిష్ భాషను సక్రమంగా మాట్లాడే విషయంలో భారత దేశంలో బ్యాంకింగ్ రంగం ముందంజలో ఉందని నివేదిక తెలిపింది. ఆంగ్ల భాషా నైపుణ్యాల విషయంలో వివిధ రంగాలకు పియర్సన్ సంస్థ మార్కులను కేటాయించింది. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన బ్యాంకింగ్ రంగానికి అత్యధికంగా 63 మార్కులు వచ్చాయి. ఈ అంశంలో బ్యాంకింగ్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సగటు మార్కులు 56 మాత్రమే. అంటే మన దేశంలోని బ్యాంకింగ్ ఉద్యోగులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలు బాగానే ఉన్నాయన్న మాట. ఇందుకు భిన్నంగా భారత్‌లోని వైద్యరంగానికి అత్యల్పంగా 45 మార్కులే వచ్చాయి. మన దేశపు టెక్, కన్సల్టింగ్, బీపీఓ రంగాలలోని ఉద్యోగులకు ప్రపంచ సగటు కంటే మెరుగుగా ఆంగ్ల భాషా నైపుణ్యాలు ఉన్నాయని నివేదికలో అత్యుత్తమ రేటింగ్ ఇచ్చారు.