Special Treatment Jailed Actor Darshan :అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. అంతేకాకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు చెబుతానని ఆయన సోమవారం అన్నారు.
"ఈ విషయం నాకు తెలిసిన వెంటనే, సీనియర్ అధికారుల బృందం జైలుకు వెళ్లి తనిఖీ చేయాల్సిందిగా డీజీపీని ఆదేశించాను. దర్శన్‌కు ఆ అధికారులు సహాయం చేశారని విచారణలో తేలింది. జైలులో సీసీటీవీ, జామర్స్ ఉన్నా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరం." అని మంత్రి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి సీరియస్
ఈ ఘటనను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్‌గా తీసుకున్నారు. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. దర్శన్‌తో పాటు మరికొందరిని తక్షణమే వివిధ జైళ్లకు తరలించాలని, ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించారు.
'రాహుల్ గాంధీ- న్యాయం అంటే ఇదేనా?'
దర్శన్ జైలు ఘటనపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ వీవీఐపీ మనస్తత్వాన్ని, అవినీతిని ఈ ఘటన తెలియజేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విచారణ ఖైదీకి రాచమర్యాదలు చేస్తున్నట్లు బయటకు వచ్చిన ఫొటో ద్వారా తెలుస్తోందని, న్యాయం అంటే ఇదేనా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దర్శన్‌ను జైలుకు పంపారా? లేక రిసార్ట్‌లో ఉంచారా అని నిలదీశారు. కర్ణాటక హోం మంత్రి, జైళ్ల శాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఇంకా ఎంత మందికి ఇలా రాచమర్యాదలు చేస్తున్నారో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.