Consitution Debate 2024 : ఆర్ఎస్ఎస్ మాజీ నేతలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారని రాజ్యాంగ పరిషత్ చర్చలు చెబుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మోసం చేస్తోందని, బదులుగా కాంగ్రెస్‌పై నిందలు వేస్తోందని ఆరోపించారు. జాతీయ జెండాను, అశోక్ చక్రాన్ని, రాజ్యాంగాన్ని ద్వేషించిన వారే నేడు రాజ్యాంగంపై పాఠాలు బోధిస్తున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, అందుకే కుల గణనను వ్యతిరేకిస్తోందని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్యసభలో సోమవారం ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై ఖర్గే విమర్శనాస్త్రాలు సంధించారు.
'నేను మున్సిపాలిటీ స్కూల్లో- ఆమె జేఎన్‌యూలో'
"నేను చదువుకుంది మున్సిపాలిటీ స్కూల్లో. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారు. హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతారు. ఆమె ఆర్థిక నిపుణురాలే కావొచ్చు. కానీ చర్యలు అస్సలు బాగోలేదు. అందరూ రాజ్యాంగం, దాని ప్రవేశికకు కట్టుబడి ఉండాలి. జన్ సంఘ్ ఒకప్పుడు మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే ఆర్ఎస్ఎస్ ఉద్దేశం కూడా. త్రివర్ణ పతాకాన్ని, అశోకచక్రాన్ని, రాజ్యాంగాన్ని ద్వేషించినవాళ్లు మాకు పాఠాలు చెబుతున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజున రాంలీలా మైదానంలో అంబేడ్కర్, మహాత్మా గాంధీ, నెహ్రూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. 1949లో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. అది మనుస్మృతి ఆధారంగా లేదని ఆ పని చేశారు" అని ఖర్గే వ్యాఖ్యానించారు.
'రాజ్యాంగం పేదలకు అధికారం కల్పిస్తుంది'
ఆర్ఎస్ఎస్లో ఇప్పటికీ మనుస్మృతి స్ఫూర్తే పాతుకుపోయిందని ఖర్గే విమర్శించారు. వారు త్రివర్ణ పతాకాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించలేదని పేర్కొన్నారు. అందుకే 2002 జనవరి 26న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయమని కోర్టు ఆదేశించిందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం పేదలకు అధికారం కల్పిస్తుందని, పాలనకు నైతిక మార్గదర్శకంగా పనిచేస్తుందని నొక్కి చెప్పారు.
"1971 యుద్ధంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించారు. లక్షలాది మంది పాక్ సైనికులను నిలువరించగలిగారు. బంగ్లాలోని మైనార్టీలను రక్షించడానికి కేంద్రం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దేశం కోసం పోరాడని వారికి స్వేచ్ఛ, రాజ్యాంగం విలువ ఎలా తెలుస్తుంది?. ప్రధాని మోదీ ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 లక్షలు వేస్తానని చెప్పారు. ఇప్పటివరకు రాలేదు. మోదీ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు గత 11 ఏళ్లలో ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పాలి"
-- మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో విపక్ష నేత
కాంగ్రెస్‌పై నిర్మల ఫైర్
తనపై రాజ్యసభలో అసత్య ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ జైరాం రమేశ్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రధాని మోదీని దొంగ అని సంభోదించిందని మండిపడ్డారు. ఇప్పుడు జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని మరో ఎంపీ అంటున్నారని, వస్తు సేవల పన్ను రాజ్యాంగ సవరణ సమయంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు సభకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలందరూ క్షమాపణలు చెప్పాలని కోరారు.