SC On NEET UG 2024 Exam :ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్షలో పేపర్ లీక్, ఇతర అక్రమాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఈ విచారణ సందర్భంగా కోటా ఆత్మహత్యల ప్రస్తావన తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం సున్నితంగా మందలించింది.
నీట్-యూజీ 2024 పరీక్షలో అక్రమాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన ఓ న్యాయవాది రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. "కోటాలో ఆత్మహత్యలకు నీట్ యూజీ 2024 ఫలితాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర, భావోద్వేగ వాదనలు ఇక్కడ చేయొద్దు" అని సూచించింది.
అనంతరం ఈ పిటిషన్‌పై రెండు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు సీబీఐ, బిహార్ ప్రభుత్వానికి కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. ఈ విషయంపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని క్లారిటీ ఇచ్చింది. బిహార్‌లో ఇటీవల నీట్ ప్రశ్నాపత్నం లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి.