తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'EVM ఓట్లతో VVPAT స్లిప్పులను 100 శాతం సరిపోల్చడం కుదరదు'- సుప్రీం కోర్టు కీలక తీర్పు - SC Judgment On EVM VVPAT - SC JUDGMENT ON EVM VVPAT

SC Judgment On EVM VVPAT : ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టేసింది. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి రెండు ఆదేశాలు జారీ చేసింది.

SC Judgment On EVM VVPAT
SC Judgment On EVM VVPAT

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 10:50 AM IST

Updated : Apr 26, 2024, 12:25 PM IST

SC Judgment On EVM VVPAT : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. అంతకుముందు రిజర్వ్ చేసిన తీర్పున ధర్మాసనం శుక్రవారం వెలువరించింది.

అంతకుముందు ఈవీఎంల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న ఈ పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రొటోకాల్‌లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం, ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్‌ చేసింది.

తాజాగా సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి రెండు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంల్లో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆ యూనిట్​ను సీల్ చేయాలని తెలిపింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలని పేర్కొంది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు 7రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని తెలిపింది. అప్పుడు ఇంజినీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని పేర్కొంది. ఈ వెరిఫికేషన్‌కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులు వారికి తిరిగి ఇవ్వాలని సూచించింది.

'వ్యవస్థను గుడ్డిగా, అపనమ్మకంతో చూడొద్దు'
ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం, అనవసర అనుమానాలకు దారి తీస్తుందని జస్టిస్ దీపాంకర్‌ దత్తా అభిప్రాయపడ్డారు. ఇక, కౌంటింగ్‌ సమయంలో పేపర్‌ స్లిప్‌లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్‌ మెషీన్‌ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్‌ ఖన్నా ఈసీకి తెలిపారు. అంతేగాక, ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్‌ కోడ్‌ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

ప్రశాంత్ భూషణ్ స్పందన
కాగా సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. 'ఈవీఎంలకు ప్రోగ్రామబుల్ మెమరీ ఉందని మేము సుప్రీంకోర్టుకు చెప్పాం. ఎందుకంటే అందులో సింబల్ లోడింగ్ జరుగుతుంది. హానికరమైన ప్రోగ్రామ్​ను అప్‌ లోడ్ చేస్తే వాటిని మార్చవచ్చు. అందుకే వీవీప్యాట్ పేపర్ ట్రయల్ ఆడిట్ చేయడం చాలా అవసరం. సుప్రీంకోర్టు మా డిమాండ్లన్నింటినీ తిరస్కరించింది.' అని ప్రశాంత్ భూషణ్ తెలిపారు.

ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంల్లోని ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.

Last Updated : Apr 26, 2024, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details