Kolkata Doctor Case Verdict Today : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో బంగాల్‌లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. గత ఏడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన జరగ్గా, ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది.
నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానంలో సీబీఐ వాదించింది. డీఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాలను న్యాయస్థానం ముందు సీబీఐ ఉంచింది. సంజయ్ రాయ్ తరఫు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.
యంత్రాంగం అడ్డుపడుతోందని అనుమానం!
మరోవైపు హత్యాచార కేసులో తీర్పు రానున్న వేళ బాధితురాలి తల్లిదండ్రులు దర్యాప్తు సగమే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సంజయ్‌రాయ్ తప్పు చేశాడని , కోర్టు అతడికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందని, అయితే ఇతర నేరస్థుల మాట ఏంటని బాధితురాలి తల్లి ప్రశ్నించారు. దర్యాప్తు సగమే పూర్తైందని ఆమె అన్నారు. ఈ నేరంలో ఇతరుల పాత్ర బయటపడకుండా యంత్రాంగం అడ్డుపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
సంజయ్‌రాయ్ ఒక్కడే!
ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. బాధిత వైద్యురాలి తండ్రి కూడా దర్యాప్తు అసంపూర్ణంగా జరిగిందని అన్నారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా అరెస్టై వారి నేరం రుజువుకావాలని అన్నారు. నిందితుడు సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష లేదా జీవితకాలం జైలుశిక్ష పడుతుందని భావిస్తున్నట్లు బాధితురాలి తల్లి తెలిపారు. నేరస్థులకు శిక్ష పడాలని, ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది కోర్టులు నిర్ణయిస్తాయని ఆమె అన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ మాత్రం నిందితుడు సంజయ్‌రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతోంది.
తీర్పు తేదీ దగ్గరపడిన వేళ నిందితుడు సంజయ్‌రాయ్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఆహారం, ఔషధాలు తీసుకోవడం నిందితుడు తగ్గించాడని పేర్కొన్నాయి. నిందితున్ని ప్రత్యేక సెల్‌లో ఉంచి అతనిపై నిరంతరం నిఘా ఉంచారు. అతని కార్యకలాపాలు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.