Minapappu Pachadi Recipe : మినపప్పుని ఎక్కువగా మార్నింగ్ టిఫెన్స్ తయారీకి వాడుతుంటారు. లేదంటే పిండి వంటకాలలో విరివిగా యూజ్ చేస్తుంటాం. కానీ, ఎప్పుడైనా మినపప్పుతో పచ్చడిని ట్రై చేశారా? లేదంటే ఓసారి తప్పక టేస్ట్ చేయాల్సిందే. రెగ్యులర్ పచ్చళ్లు తిని బోర్ కొట్టిన వాళ్లకు సరికొత్త రుచిని అందిస్తుంది. పచ్చిమిర్చితో చేసుకునే ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతం! మరి, ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మినపప్పు - అర కప్పు
- టమాటాలు - 3(మీడియం సైజ్‌వి)
- ఉల్లిపాయ - 1(మీడియం సైజ్ది)
- పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
- ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు
- మెంతులు - చిటికెడు
- జీలకర్ర - పావుటీస్పూన్
- చింతపండు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- పోపు దినుసులు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 3
- వెల్లుల్లి రెబ్బలు - 5
- కరివేపాకు - కొద్దిగా
మీరు ఎన్నడూ తిని ఉండరు - "పచ్చి టమాటా పచ్చడి" - టేస్ట్ నెక్స్ట్ లెవల్ అంతే!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన టమాటాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని 1 టేబుల్‌స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆపై అదే ఆయిల్లో మినపప్పుని వేసి లో-ఫ్లేమ్ మీద ఎర్రగా మారే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
- ఆ తర్వాత అందులో అదనంగా మరో టేబుల్‌స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక మెంతులు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి.
- అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని టమాటా గుజ్జుని కాస్త చల్లారనివ్వాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, మినపప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో చల్లారిన టమాటా గుజ్జుని యాడ్ చేసుకొని కలిపి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే, మరీ మెత్తగా కాకుండా తినేటప్పుడు మినపప్పు అనేది లైట్‌గా పంటికి తగిలేలా చూసుకోవాలి.
- ఒకవేళ పచ్చడి మరీ గట్టిగా ఉంటే మీకు నచ్చదనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు.
- ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి.
- అవి వేగాక ఎండుమిర్చి తుంపలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి చక్కగా వేయించాలి.
- తాలింపు వేగాక స్టౌ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని అందులో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే, ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "మినపప్పు పచ్చడి" రెడీ!
ఇదొక్కటి వేసి "పల్లీ చట్నీ" చేయండి - టిఫెన్స్లోకి పర్ఫెక్ట్ టేస్ట్‌తో అదుర్స్ అనిపిస్తుంది!