Golden Baba In Maha Kumbh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో వెరైటీ సాధువులు, సన్యాసులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆరు కేజీల బంగారు ఆభరణాలను ధరించి గోల్డెన్ బాబా సందడి చేస్తున్నారు. గోల్డెన్ బాబా అసలు పేరు మహా మండలేశ్వర్ నారాయణానంద్ గిరి మహరాజ్. ఈయన నిరంజనీ అఖాడాకు చెందినవారు. స్వామి నారాయణానంద్ గిరి మహరాజ్ కేరళకు చెందినవారు.
"ఇంతకీ మీరు 6 కేజీల బంగారు ఆభరణాలను ఎందుకు ధరిస్తున్నారు?" అని స్వామీజీని ప్రశ్నిస్తే, "నేను ధరించిన బంగారు ఆభరణాలన్నీ వివిధ దేవతలకు గుర్తుగా వేసుకున్నవి. నటరాజ స్వామి, నరసింహ స్వామి, మురుగన్ స్వామి, భద్రకాళి స్వామి తదితర దేవతలకు గుర్తుగా వాటిని ధరించాను" అని చెప్పారు.
"ఇంతకీ ఇన్ని ఆభరణాలను ఎందుకు ధరిస్తున్నారు ?" అని నారాయణానంద్ గిరి మహరాజ్‌ను అడిగితే, "నాకు వాటి నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది" అని బదులిచ్చారు. పూజల ద్వారానూ తనకు పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంటుందని తెలిపారు. తన ఆభరణాల్లో రుద్రాక్షలు, పగడాలు, ఎరుపు పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగి ఉంటాయని గోల్డెన్ బాబా తెలిపారు. దేవతా పూజల్లోనూ ఇవన్నీ వినియోగిస్తుంటామని ఆయన గుర్తుచేశారు. బంగారు ఆభరణాలతో పాటు శ్రీ యంత్రం చిహ్నాన్ని కూడా తాను ధరిస్తానన్నారు.
"నా పూర్తి పేరు 1008వ అనంత శ్రీ విభుశిత్ స్వామి నారాయణానంద్ గిరి మహరాజ్. కేరళలో సనాతన ధర్మ ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా సేవలు అందిస్తున్నాను" అని ఆయన చెప్పుకొచ్చారు. గత 15 ఏళ్లుగా తాను ఆభరణాలను ధరిస్తున్నట్లు వెల్లడించారు. "మా నాన్న గారు ఇచ్చిన రుద్రాక్షలను నేటికీ నేను ధరిస్తున్నాను. వాటి నుంచి నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. ఒకవేళ నేను ట్రౌజర్లు, షర్టులు ధరించి ఉంటే మీరు వచ్చి నన్ను పలకరించి ఉండేవారు కాదు. ఈ రుద్రాక్షల పాజిటివ్ ఎనర్జీ వల్లే అంతా జరిగిపోతోంది. పాజిటివ్ ఎనర్జీని వ్యాపింపజేసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు" అని స్వామి నారాయణానంద్ గిరి పేర్కొన్నారు.
ఇవాళ 19.8 లక్షల మంది భక్తుల పుణ్య స్నానాలు
మహాకుంభ మేళాలో భాగంగా ఇవాళ (శనివారం) తెల్లవారుజామున నుంచి ఉదయం 10 గంటల వరకు దాదాపు 19.8 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేళా మొదలైనప్పటి నుంచి శుక్రవారం వరకు దాదాపు 7.3 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌ను సందర్శించుకున్నట్లు తెలిపింది. భారీగా తరలివస్తున్న భక్తుల్లో ఎవరైనా తప్పిపోతే గుర్తించేందుకు ఏఐ ఆధారిత సహాయ కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. కుంభమేళా పూర్తయ్యే నాటికి 45 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వస్తారని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లోని సర్దార్ పటేల్ అకాడమీకి సీఎం యోగి లేఖ
మహాకుంభమేళా ప్రాంగణంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. యువ పోలీసులను శిక్షణ కోసం మహాకుంభమేళాకు పంపాలని హైదరాబాద్‌లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ అకాడమీకి లేఖ రాసినట్టు యోగి చెప్పారు. మహా కుంభమేళా జరుగుతున్న తీరుపై ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు అధ్యయనాలు, పరిశోధనలు చేస్తున్నాయన్నారు.
కుంభమేళాలో ట్రైపాడ్, స్మార్ట్‌ఫోన్‌తో 'డిజిటల్ బాబా' సందడి- యూత్ టార్గెట్‌గా ప్రవచనాలు!
కుంభమేళాకు 129 ఏళ్ల స్వామి శివానంద- 100 సంవత్సరాలుగా ప్రతిసారీ!