Kolkata Doctor Case Verdict : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌జీ కర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది. అతడికి జనవరి 20న శిక్ష ఖరారు చేయనుంది.
భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద దోషి సంజయ్‌రాయ్‌కు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ సందర్భంగా కోర్టులో మాట్లాడిన దోషి సంజయ్‌రాయ్, తాను ఈ నేరానికి పాల్పడలేదని తెలిపాడు. ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని అన్నాడు. నేరం చేసిన వారిని వదిలేశారని, ఇందులో ఒక ఐపీఎస్ పాత్ర ఉందని తెలిపాడు. సోమవారం శిక్ష ఖరారు సందర్భంగా దోషి సంజయ్‌రాయ్ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని సీల్దా కోర్టు అదనపు జిల్లా జడ్జి వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు సందర్భంగా సీల్దా కోర్టు బయట పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. వైద్యురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు.
#WATCH | Kolkata, West Bengal: Additional District Judge Sealdah Court finds accused Sanjay Roy guilty in the RG Kar rape-murder case.
— ANI (@ANI) January 18, 2025
(Visuals from outside Sealdah Court) pic.twitter.com/lA6C6gOpTF
ఇదీ జరిగింది
గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన జరిగింది. సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై నిందితుడు సంజయ్‌రాయ్ అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సివిక్ వాలంటీరైన సంజయ్ రాయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు ఆరెస్టు చేశారు. అయితే కోల్‌కతా పోలీసులు కేసును తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపణలు రావడం వల్ల కలకత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఆగస్టు 14న కోల్‌కతా పోలీసుల నుంచి హత్యాచార కేసును సీబీఐ స్వీకరించింది. నిందితుడు సంజయ్‌కు లై డిటెక్టర్ టెస్ను నిర్వహించింది.
ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసు దర్యాప్తులో భాగంగా 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగపత్రంలో ప్రస్తావించలేదు. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు సంబంధించిన డీఎన్‌ఏ, మృతిరాలి శరీరంపై లభ్యమైనట్లు సీబీఐ వెల్లడించింది. ఘటనాస్థలంలో లభ్యమైన వెంట్రుకలు, బ్లూటూత్ ఇయర్ ఫోన్ నిందితుడివేనని తెలిపింది. మృతురాలి రక్త నమూనాలు సంజయ్ రాయ్ దుస్తులు, చెప్పులపై లభ్యమైనట్లు రుజువులను అభియోగపత్రంలో సీబీఐ పేర్కొంది.
సంజయ్ రాయ్‌కు మరణ శిక్ష విధించాలి
నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానంలో సీబీఐ వాదించింది. సంజయ్ రాయ్ తరఫు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. సోమవారం తీర్పు వెలువడింది.
'దర్యాప్తు సగమే జరిగింది'
మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం దర్యాప్తు సగమే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపించారు.
నిందితుడి ప్రవర్తనలో మార్పులు
తీర్పు తేదీ దగ్గరపడినప్పుడు నిందితుడు సంజయ్‌రాయ్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఆహారం, ఔషధాలు తీసుకోవడం నిందితుడు తగ్గించాడని పేర్కొన్నాయి. నిందితున్ని ప్రత్యేక సెల్‌లో ఉంచి అతనిపై నిరంతరం నిఘా ఉంచారు. అతని కార్యకలాపాలు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జి అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా, తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయకపోవడం వల్ల ఈ బెయిల్ లభించింది.