Kejriwal On Tenants Free Electricity : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ఆమ్‌ఆద్మీ దిల్లీ ప్రజలకు వరుస హామీలను ప్రకటిస్తోంది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో హామీని ప్రకటించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిలోని అద్దె ఇళ్లల్లో నివసించే వారికి ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని పేర్కొన్నారు. పూర్వాంచల్‌కు చెందిన అనేక మంది కౌలుదారులకు సైతం ఉచిత విద్యుత్, నీటి సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
"నేను దిల్లీలో ఎక్కడికి వెళ్లినా కిరాయిదారులు నాతో ఇలా చెబుతారు. మీ పాఠశాలల వల్ల మేం లబ్ధి పొందుతున్నాం. మొహల్లా క్లినిక్స్, ఆస్పత్రుల వల్ల, ఉచిత బస్సు సేవలు, ఉచిత తీర్థయాత్ర సేవలు పొందుతున్నామని చెబుతారు. కానీ ప్రభుత్వం నుంచి ఉచిత విద్యుత్, నీళ్లు మాకు రావడం లేదని వాపోతున్నారు. నేను ఏం చెప్పదలచుకున్నానంటే ఈ ఎన్నికల్లో మా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే కిరాయిదారుల కోసం పథకాలు, వ్యవస్థను తీసుకొస్తాం. వాటి నుంచి కిరాయిదారులకు విద్యుత్, నీళ్లు ఉచితంగా వస్తాయి"
--అరవింద్ కేజ్రీవాల్, ఆప్ అధినేత
ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశ రాజధానిలోని ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఉచితాల వైపు దృష్టి సారించాయి. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత రేషన్ కిట్లు, ఏడాదిపాటు నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.8,500, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయం, రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు కల్పిస్తామని కాంగ్రెస్ పేర్కొంది.
VIDEO | Delhi elections: Here's what AAP national convenor Arvind Kejriwal (@ArvindKejriwal) said announcing free electricity and water for tenants:
— Press Trust of India (@PTI_News) January 18, 2025
" across delhi, we have provided free electricity and water to residents. however, it is unfortunate that tenants do not get these… pic.twitter.com/Cnzn0o7yp6
బీజేపీ సైతం 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో విడుదల చేసిన పార్టీ హామీలను ప్రకటించింది. అందులో గర్భిణులకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు, 'మహిళా సమృద్ధి యోజన' కింద దిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం వంటి హామీలను ప్రకటించింది.