ICC Champions Trophy Team India : 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ భారత జట్టను ప్రకటించింది. శనివారం ముంబయిలో సమావేశమైన సెలక్షన్ కమిటీ 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. అందరూ అనుకున్నట్లే టోర్నీలో కూడా రోహిత్ శర్మే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీకి యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. ఇక సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడింది. ఈ జట్టులో అతడికి చోటు దక్కలేదు.
స్పిన్ కోటాలో నలుగురు- ముగ్గురు పేసర్లు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో స్పిన్ కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కు అవకాశం దక్కింది. బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, షమీ పేస్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. గాయం కారణంలో 14 నెలలుగా ఆటకు దూరమైన పేసర్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే ఆసీస్ టూర్ లో గాయపడిన బుమ్రాకు కూడా తాజాగా వెలువరించిన జట్టులో ప్లేస్ సంపాదించుకున్నాడు.
కొత్తవారికి అవకాశం
వన్డే ప్రపంచకప్ 2023 ఆడిన చాలా మంది ప్లేయర్లు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చోటు దక్కించుకున్నారు. కొత్తగా అర్ష్ దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వీ జైస్వాల్ అవకాశం దక్కించుకున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లో ఎవరో ఒకరు వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో టెస్టులు, టీ20ల్లో అదరగొట్టడం వల్ల జైస్వాల్ కు వన్డే టీమ్ లో చోటు కల్పించారు.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా
అదే విధంగా ఇంగ్లాండ్ తో ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9న రెండో వన్డే, మూడో వన్డే ఫిబ్రవరి 12న జరగనుంది. ఈ క్రమంలో ఈ సిరీస్ కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన ప్లేయర్లనే దాదాపు ఎంపిక చేసింది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చింది. టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కు ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా