తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- ఇకపై చట్టం అమలు ఇలా! - SUPREME COURT ON CHILD MARRIAGE

బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

Supreme Court
Supreme Court (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 11:50 AM IST

Updated : Oct 18, 2024, 12:20 PM IST

Supreme Court On Child Marriage :బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలతో ఎలాంటి సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని సూచించింది. బాల్యంలో వివాహం చేస్తే, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్లే అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. వ్యక్తిగత చట్టాలతో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అడ్డుకోవద్దని అభిప్రాయపడింది. బాల్య వివాహాలు మైనర్లకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను హరిస్తాయని పేర్కొంది. బాల్య వివాహాలు, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని సూచించింది. నేరస్థులకు జరిమానా విధించాలని నిర్దేశించింది.

"బాల్యవివాహాలను నివారించాలనే వ్యూహాలు వివిధ వర్గాలకు అనుగుణంగా ఉండాలి. బహుళ రంగాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే చట్టం విజయవంతం అవుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులకు దీనిపై శిక్షణ సామర్థ్యాన్ని పెంచాలి. కమ్యూనిటీ ఆధారిత విధానాలు ఉండాలి" అని ధర్మాసనం పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006లో రూపొందించారు. ఈ చట్టాన్ని 1929 నాటి బాల్య వివాహ నిరోధక చట్టం స్థానంలో తీసుకొచ్చారు.

Last Updated : Oct 18, 2024, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details