Saif Ali Khan Attack :సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇంతకు ముందు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారికి కత్తిదాడి ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. 30కి పైగా పోలీసు బృందాలు ముంబయి వ్యాప్తంగా జల్లెడ పట్టారు. ఓ లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో థానే జిల్లా ఘోడ్ బందర్ రోడ్డులోని హిరానందని ఎస్టేట్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని గుర్తించే క్రమంలో వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇన్ఫార్మర్ల సాయంతోనూ సమాచారాన్ని రాబట్టారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పినట్టు పోలీసులు తెలిపారు. తొలుత విజయ్ దాస్‌గా, తర్వాత బిజయ్ దాస్‌గా, ఆ తర్వాత మహమ్మద్ ఇలియాస్‌గా పేర్కొన్నాడని చెప్పారు. నిందితుడి అసలు పేరు మమహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చి తప్పుడు పేర్లు చెబుతూ తిరిగాడని పేర్కొన్నారు. నిందితుడి జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా బంగ్లాదేశ్‌కు చెందిన వాడని పోలీసులు ధ్రువీకరించారు.
దుండగుడు బంగ్లాదేశ్ లోని ఝాలోకటికి చెందినవాడని చెప్పారు. ముంబయిలో ఐదు నెలలుగా ఉంటున్నాడని, కొన్ని చిన్న తరహా ఉద్యోగాలు చేశాడని పేర్కొన్నారు. ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలోనూ పనిచేశాడని చెప్పారు. చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంటిలోకి దుండగుడు వెళ్లాడని, కానీ ఓ బాలీవుడ్ నటుడి ఇంట్లోకి వెళ్లినట్టు తెలియదని ప్రాథమికంగా తెలిసినట్టు చెప్పారు. దొంగతనం, హత్యాయత్నానికి సంబంధించి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.