Dondakaya Tomato Pachadi in Telugu : చాలా మంది దొండకాయను అంతగా తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలైతే దొండకాయ చూస్తేనే మొహం చిట్లిస్తుంటారు. అలాంటి వారికోసం ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, నోరూరించే "దొండకాయ టమాటా పచ్చడి". ఈ స్టైల్లో ఒక్కసారి పచ్చడిని చేసి పెట్టండి. దొండకాయను వద్దన్నవారే లొట్టలేసుకుంటూ తింటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ చట్నీ టేస్ట్! వేడివేడి అన్నంలో కాస్త నెయ్యితో తిన్నారంటే ఆ రుచి అమోఘం. అన్నంలోకే కాదు టిఫెన్స్లోకి సూపర్‌గా ఉంటుంది. మరి, ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- పల్లీలు - 2 టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - రుచికి సరిపడా
- కొత్తిమీర - కొద్దిగా
- దొండకాయలు - పావుకిలో
- జీలకర్ర - 1 టీస్పూన్
- టమాటాలు - 4(మీడియం సైజ్‌వి)
- చింతపండు - కొద్దిగా
- పసుపు - పావుటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 7
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ - 1(మీడియం సైజ్ది)
తాలింపు కోసం :
- ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు
- పోపు గింజలు - కొద్దిగా
- ఎండుమిర్చి - 3
- కరివేపాకు - 2 రెమ్మలు
తెలంగాణ స్టైల్ "రేగుపండ్ల నిల్వ పచ్చడి" - ఒక్కసారైనా రుచి చూడాల్సిందే! - ఏడాది నిల్వ!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి సన్నగా, రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక అందులో కొత్తిమీర, పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని అన్నింటినీ చక్కగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
- ఆ తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర వేసి వేయించుకోవాలి. అది కాస్త వేగాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆపై మూతపెట్టి లో ఫ్లేమ్ మీద దొండకాయ ముక్కలు బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. మధ్యమధ్యలో మూత తీసి గరిటెతో కలుపుకోవాలి. లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది.
- దొండకాయ ముక్కలు మంచిగా మగ్గాయనుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు, పసుపు వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి టమాటాలు బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఆవిధంగా కుక్ చేసుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి పల్లీల మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో చల్లారిన దొండకాయ మిశ్రమం వేసుకొని రోట్లో దంచుకున్న మాదిరిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చివర్లో ఉల్లిపాయ చీలికలు వేసుకొని ఒక పల్స్ ఇచ్చి వదిలేయాలి. ఆపై పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత తాలింపుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ "దొండకాయ టమాటా పచ్చడి" మీ ముందు ఉంటుంది!
ప్రొటీన్ పుష్కలంగా ఉండే కమ్మని "పుదీనా పచ్చడి" - వేడివేడి అన్నంలో తింటే అమృతమే!