Wedding In Rashtrapati Bhavan : దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్లో పీఎస్ఓగా సేవలు అందిస్తున్న సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి ఈ అత్యున్నత స్థాయి భవనం వేదికగా నిలవనుంది. రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో వివాహ వేడుకను నిర్వహించుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతి మంజూరు చేశారు. ఫిబ్రవరి 12న జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా సేవలు అందిస్తున్న అవ్నీష్ కుమార్‌తో పూనమ్ గుప్తా వివాహం జరగనుంది. ఈ వేడుకలో వరుడు, వధువు తరఫు బంధువులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
రాష్ట్రపతి ముర్ము సంతోషంతో అనుమతి ఇచ్చారు : ప్రేమేంద్ర బిర్థరే
"రాష్ట్రపతి భవన్లో పీఎస్ఓ హోదాలో అంకితభావంతో పూనమ్ గుప్తా సేవలు అందిస్తున్నారు. దీంతో పలుమార్లు పూనమ్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు" అని పూనమ్ కుటుంబానికి సన్నిహితుడైన ప్రేమేంద్ర బిర్థరే (సోనూ) ఈటీవీ భారత్‌కు తెలిపారు. "పూనమ్‌కు పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసి ముర్ము సంతోషించారు. వివాహ వేడుకను రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఎంపిక చేసిన వారిని మాత్రమే వేడుకకు ఆహ్వానిస్తున్నారు. వధువు, వరుడు తరఫున పెళ్లికి హాజరయ్యే వారి జాబితా రూపకల్పన జరుగుతోంది. ఈ జాబితాలో ఉండేవారినే లోపలికి అనుమతిస్తారు" అని ప్రేమేంద్ర బిర్థరే వెల్లడించారు.
పూనమ్ గుప్తా నేపథ్యం ఇదీ
పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా వాస్తవ్యురాలు. ఆమె వివాహ వేడుక ఏకంగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగబోతోందని తెలిసి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ పాఠశాల చదువు-- జవహర్ నవోదయ విద్యాలయంలో సాగింది. ఆమె తండ్రి శివపురిలోని నవోదయ విద్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా సేవలు అందిస్తున్నారు. పూనమ్ గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గ్వాలియర్‌లోని జివాజీ విశ్వవిద్యాలయంలో బీఈడీ చేశారు. 2018లో జరిగిన యూపీఎస్సీ సీఏపీఎఫ్ పరీక్షలో పూనమ్‌కు 81వ ర్యాంక్ వచ్చింది. దీంతో సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పోస్టింగ్ లభించింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి సారథ్యం వహించారు.