KCR Fire on Telangana Government : రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని, ఇప్పుడే మన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గజ్వేల్లో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల జరిగిన సమావేశంలో ప్రభుత్వంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరో 4 నెలల గడిస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి : రాష్ట్రాన్ని కైలాసంలో పెద్దపాము మింగినట్లైందని, తెలంగాణకు ఇదో మంచి గుణపాఠమని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని, బీఆర్ఎస్ హయాంలో ఆదాయం ఏటా పెరిగితే ఇప్పుడు పడిపోయిందని ఆరోపించారు. రూ.13 వేల కోట్ల ఆదాయం పడిపోయిందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని, మరో 4 నెలల గడిస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అన్నారు. భూముల ధరలు బాగా పడిపోయాయని, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందని విమర్శించారు.
భూముల ధరలు అమాంతం పడిపోయాయి : పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదని అన్నారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ శక్తి ఏంటో చూపించి, కాంగ్రెస్ మెడలు వంచుతామని హెచ్చరించారు. అత్యాశకు పోయి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని, తులం బంగారం ఇస్తారని ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారని అన్నారు. రైతు భరోసా ఇస్తారో లేదో ఇచ్చినా కూడా మోసమే ఎన్నికల కోసమే ఇస్తారని అన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని, మన విజయం, తెలంగాణ ప్రజల విజయం కావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని జనం ఓట్లేశారు : ఎన్నో ప్రభుత్వాలను చూశానని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని కేసీఆర్ పేర్కోన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ వాళ్లు కనపడితే జనాలు కొట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓటింగ్ పెట్టారని, బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని జనం ఓట్లేశారని తెలిపారు. ఫాం హౌస్ ఫాం హౌస్ అని అంటారని, ఇక్కడ అల్లం, ఉల్లిపాయ తప్ప ఏమున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు ఇక్కడకు వస్తే తలో పార ఇచ్చి తవ్వుకోమందామని ఎద్దేవా చేశారు. కచ్చితంగా రాబోయేది మన ప్రభుత్వమేనని, అందులో అనుమానం ఏమీ లేదని కేసీఆర్ పెర్కోన్నారు.
గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా : ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని, సంగమేశ్వరం, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని విమర్శించారు. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని, కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం నా అలవాటని అన్నారు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెడతామని వెల్లడించారు.
"రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయి. సంగమేశ్వరం, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారు. ఇప్పుడే మన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మామూలుగా కాదు. గట్టిగా కొట్టడం నా అలవాటు."- కేసీఆర్, మాజీ సీఎం