Sonia Gandhi Comments On President : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి భవన్ ఖండించింది. రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు అత్యున్నతమైన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపింది. ఈమేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఈ అంశంపై బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లాంటి నేతలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. అనంతరం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని మీడియా పలకరించింది. ఆ సమయంలో ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి ముర్ము బాగా అలసిపోయారని, అతి కష్టం మీద మాట్లాడినట్టు కనిపించారని సోనియా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక భావజాలం బయటపడింది : జేపీ నడ్డా
సోనియా గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. రాష్ట్రపతి ముర్మును ఉద్దేశించి చులకన అనే పదాన్ని సోనియాగాంధీ ప్రయోగించడాన్ని తాను, ప్రతీ బీజేపీ కార్యకర్త బలంగా ఖండిస్తారని ఆయన తెలిపారు. "కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన పేదల వ్యతిరేక, గిరిజన వ్యతిరేక భావజాలం బయటపడింది. ఈ అంశంపై కాంగ్రెస్ బేషరతుగా రాష్ట్రపతికి, దేశంలోని గిరిజన వర్గానికి క్షమాపణలు చెప్పాలి" అని జేపీ నడ్డా డిమాండ్ చేశారు.
BJP President JP Nadda says, " i and every bjp karyakarta strongly condemns the usage of the phrase "poor thing" by smt. sonia gandhi for honourable president of india, droupadi murmu ji. the deliberate usage of such words shows the elitist, anti-poor and anti-tribal nature of the… pic.twitter.com/wsHibdfTL7
— ANI (@ANI) January 31, 2025
ముర్ముకు క్షమాపణ చెప్పాల్సిందే : కిరణ్ రిజిజు
సోనియాగాంధీ, ఇతర విపక్ష నేతలు రాష్ట్రపతి ప్రసంగంపై చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. "ద్రౌపది ముర్ము మన దేశ రాష్ట్రపతి, ఆమె ఓ గిరిజన వనిత. ఇక్కడ బలహీనమైన అంశమేం ఉంది? ద్రౌపది ముర్ము దేశం కోసం ఎంతో సేవ చేశారు. సామాజిక సేవకు ఆమె జీవితాన్ని అర్పించారు. ముర్ము మన దేశం కోసం చేసిన సేవను విపక్ష నేతలు కనీసం ఊహించనూ లేరు. వాళ్లు తప్పకుండా ఆమెకు క్షమాపణలు చెప్పాల్సిందే" అని ఆయన డిమాండ్ చేశారు.
#WATCH | On Congress MP Sonia Gandhi's statement on President Droupadi Murmu, Parliamentary Affairs Minister Kiren Rijiju says, " ... i condemn the comments made by sonia gandhi and other opposition leaders. our president, a tribal woman, is not weak... droupadi murmu has worked… pic.twitter.com/d5R3n8ULYa
— ANI (@ANI) January 31, 2025
'సోనియాగాంధీ జమీందారీ మనస్తత్వం బయటపడింది'
సోనియాగాంధీ వ్యాఖ్యలతో ఆమె జమీందారీ మనస్తత్వం మరోసారి బయటపడిందని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వీయ విమర్శించారు. రాష్ట్రపతి లాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నవారిని ఉద్దేశించి చులకన వంటి పదాలను ప్రయోగించడం సరికాదన్నారు. రాష్ట్రపతి కార్యాలయాన్ని అగౌరవపరిచేలా సోనియాగాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
గతంలోనూ కాంగ్రెస్ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అమిత్ మాల్వియ ఆరోపించారు. తొలిసారిగా ఒక గిరిజన మహిళ దేశ అత్యున్నత హోదాలో ఉండటాన్ని చూసి ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. "నిత్యం చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాష్ట్రపతిని గౌరవపూర్వకంగా కలవలేదు. నిజానికి వాళ్లకు రాజ్యాంగంపై గౌరవం లేదు. దళితులు, ఓబీసీలు, గిరిజనులంటే కాంగ్రెస్‌కు పట్టదు" అని అమిత్ మాల్వియ మండిపడ్డారు.
#WATCH | Delhi: On Sonia Gandhi's remarks on President Murmu and her speech, Congress MP Priyanka Gandhi Vadra says, " my mother is a 70-80 years old lady, she has simply said that 'the president read such a long speech and she must have been tired, poor thing'...she fully… pic.twitter.com/Kmi2GCsgz5
— ANI (@ANI) January 31, 2025
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. "నా తల్లి 70-80 ఏళ్ల వయసు ఉన్న మహిళ. రాష్ట్రపతి అంత సుదీర్ఘమైన ప్రసంగాన్ని చదివారు. ఆమె అలసిపోయి ఉంటారు. సోనియా ఎప్పుడూ రాష్ట్రపతిని గౌరవిస్తారు. ఆ విషయాన్ని మీడియా వక్రీకరించడం చాలా దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. బీజేపీ మొదట క్షమాపణ చెప్పాలి" అని ప్రియాంక డిమాండ్ చేశారు.