Police Dogs Wear Shoes In Karnataka : పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, నేరగాళ్ల జాడలను పట్టేస్తాయి జాగిలాలు. కదులుతున్న వాహనాల్లోంచి సైతం దూకి టార్గెట్‌ను అడ్డుకుంటాయి. శిక్షకుడి కమాండ్స్‌ను స్పష్టంగా అర్థం చేసుకోని అమలు చేస్తాయి పోలీసు జాగిలాలు. ప్రస్తుతం ఎండలకు సామాన్యులకు పరిస్థితే దారుణంగా ఉంటే, ఇంకా జాగిలాల సంగతి మరీ ఘోరంగా ఉంటుంది. అందుకే కర్ణాటక కలబురగి పోలీసు యంత్రాంగం వాటి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.
బూట్లతో జాగిలాలు
ప్రస్తుతం జిల్లా యంత్రాంగం దగ్గర రీటా, జిమ్మీ, రాణి, రింకీ అనే పోలీసు జాగిలాలు ఉన్నాయి. అయితే వేసవిలో బయటకు వెళ్లినప్పుడు వాటి కాళ్లకు రక్షణగా బూట్లు వేస్తున్నారు. అంతే కాదు జిల్లా సాయుధ రిజర్వ్‌ల ప్రాంగణంలో కుక్కలకు సౌకర్యాలు కల్పించారు. మండే వేసవిలో చల్లదనం కోసం కూలర్లు ఏర్పాట్లు చేశారు. అలాగే వాటికి నిరంతరం నీరు, సగ్గుబియ్యం, కొబ్బరి నీళ్లు ఇలా ఇతర చల్లని పదార్ధాలు అందుబాటులో ఉంచారు.
ఎండ, వేడితో సంబంధం లేకుండా పోలీసు కుక్కలు రోజంతా కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని అందుకే ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. శిబిరంలో ఉన్నప్పుడు చల్లగా ఉండటం కోసం కూలర్, బయటకు వెళ్ళినప్పుడు షూ వేసి వాటి కాలు కాలకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుమని అన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రంలో భాగంగా కర్ణాటకకు వచ్చినప్పుడు ఈ జాగిలాలే సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించాయి. ఈ పోలీసు జాగిలాలకోసం రోజుకి మూడు వందల రూపాయాల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు.