Panchkula Pharma Company Diwali Bonus :సంస్థ కోసం పాటు పడుతున్న ఉద్యోగుల కోసం పండగలు, ప్రత్యేక సందర్భాల్లో కానుకలు ఇస్తుంటాయి కంపెనీలు. అలాగే వార్షిక బోనస్, పండగ బోనస్ అంటూ ఇస్తారు. అయితే, తమ కంపెనీని విజయవంతంగా నడిపించడంలో ఉద్యోగులు చేస్తున్న కృషికి గుర్తింపుగా హరియాణాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ ఓ అడుగు ముందుకేసి ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా తమ ఉద్యోగులకు లగ్జరీ కార్లను పంపిణీ చేసింది.
టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా గిఫ్ట్స్
పంచకులలో ఉన్న ఓ ఫార్మా కంపెనీ యజమాని ఎన్కే భాటియా తమ ఉద్యోగులకు దీపావళి కానుకగా టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా కార్లను బహుమతిగా ఇచ్చారు. 'స్టార్ పెర్‌ఫార్మర్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచిన 15 మంది కంపెనీ ఉద్యోగులకు ఈ గిఫ్ట్ ను అందించారు. గతేడాది కూడా కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఉద్యోగులకు ఇలానే బహుమతులను అందించారు.
వారికే పెద్దపీట!
"కంపెనీలో 'స్టార్ పెర్‌ఫార్మర్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచిన 15 మంది ఉద్యోగులకు అక్టోబర్ 14న కార్లను బహుమతిగా ఇచ్చాం. టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా వాహనాలను ఉద్యోగులకు అందించాం. కంపెనీలో మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు పెద్దపీట వేస్తాం. ఇలా ఉద్యోగులకు గిఫ్ట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. దీంతో వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భవిష్యత్తులో మరింత బాగా పనిచేస్తారు. వారిని చూసి ఇతర ఉద్యోగులు కూడా బాగా పనిచేయాలని స్ఫూర్తి పొందుతారు" అని ఎన్కే భాటియా తెలిపారు.