Jammu Kashmir Road Accident : జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సైనికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పహారా కాసేందుకు వెళ్తున్న ఓ సైనిక వాహనం బందిపొరాలోని వులార్ వ్యూపాయింట్ వద్ద అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.
ఈ ఘటనలో నలుగురు సైనికులు మృత్యువాత పడగా.. మరొకరికి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలిలోనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. క్షతగాత్రులను బందిపొరా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు శ్రీనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
వారం రోజుల క్రితం పూంఛ్ జిల్లాలోనూ ఇదే తరహా ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గరోవా ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంచు ఎక్కువగా కురుస్తుండటం వల్ల రోడ్డును అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.