One Nation One Election Committee Review :ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ మరోసారి సమీక్ష జరిపింది. శనివారం జరిగిన సమావేశంలో గతేడాది 'కమిటీ ఏర్పాటు' తర్వాత సాధించిన ప్రగతిని సమీక్షించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కేంద్రం ఈ కమిటీని నియమించింది.
జమిలి ఎన్నికలపై ఈ కమిటీ రాజ్యాంగ సవరణలు ఇతర అంశాల్లో సిఫార్సులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో దేశంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోంది. అధికార ఎన్డీఏ, శివసేన వంటి పార్టీలు ఏకకాల ఎన్నికల భావనకు మద్దతిస్తున్నాయి. వీటివల్ల ఎన్నికల ఖర్చు, సమయం తగ్గుతుందని భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు ఈ ఆలోచనను తప్పుబడుతున్నాయి. ఇలా చేస్తే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను అర్ధంతరంగా నిలిపివేయాల్సి వస్తుందని, ఇది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని చెబుతున్నాయి.
ప్రజల నుంచి సూచనలు
కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి గత నెలలో సూచనలు స్వీకరించింది. దాంతో పాటు దేశంలోని 6 జాతీయ, 33 రాష్ట్ర పార్టీలతోపాటు 7 గుర్తింపు పొందని పార్టీల నుంచి అంతకుముందు జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలు కోరింది. జమిలీ ఎన్నికలపై లా కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ ఇప్పటికే తీసుకుంది.