Mathadi Mahaprasad To Ayodhya :ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరగనున్న మొదటి శ్రీ రామనవమి వేడుకల కోసం దేశం మొత్తం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ నాథ్ద్వారాలోని శ్రీనాథ్‌జీ అనే ఓ పురాతనమైన శ్రీ కృష్ణుడి ఆలయం నుంచి తొలిసారి 'మఠడీ' అనే మహాప్రసాదాన్ని అయోధ్య రాముడి కోసం తరలించారు. దీనికి సంబంధించిన యాత్ర శ్రీనాథ్‌జీ ఆలయం నుంచి ఆదివారం ప్రారంభమైంది. ఏప్రిల్ 17 బుధవారం శ్రీ రామనవమి రోజున ఇది అయోధ్యకు చేరుకుంటుంది. అక్కడ బాలక్రాముడికి ఈ మఠడీ ప్రసాదాన్ని నివేదించిన తర్వాత గుడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచనున్నారు. ఈ మేరకు లక్ష మఠడీల మహాప్రసాదాన్ని అయోధ్యకు పంపినట్లు శ్రీనాథ్‌జీ ఆలయ నిర్వాహకులు తెలిపారు.
నాథ్‌ద్వారా నుంచి ప్రారంభమైన మఠడీ మహాప్రసాదం యాత్ర భిల్వారా, జైపూర్, మథుర జాతిపుర, లఖ్‌నవూ మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది. అయితే రామనవమి సందర్భంగా అయోధ్యలో పంచనున్న ఈ మఠడీ ప్రసాదాన్ని ఇదే రోజు శ్రీనాథ్‌జీ ఆలయంలోనూ ఉచితంగా పంచనున్నారు. ఇక్కడ 11 వేల మఠడీలను భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏంటీ శ్రీనాథ్‌జీ మఠడీ మహాప్రసాదం?
'మఠడీ' పేరుగల ఆహార పదార్థాన్ని శ్రీ కృష్ణుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది ఓ ప్రత్యేకమైన వంటకం. దీనిని ఉదయ్‌పుర్ నాథ్ద్వారాలోని శ్రీ నాథ్జీ ఆలయంలో మాత్రమే తయారు చేస్తారు. దేశంలో మరే ఆలయంలో కూడా ఈ ప్రసాదం కనిపించదు. ఈ ప్రసాదాన్ని గోధుమ పిండి, పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పంచదార పాకంతో తయారు చేస్తారు. అయితే ఈ మఠడీ ప్రసాదం త్వరగా పాడవ్వకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందట.