Opposition On Delhi Stampede : దిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. రైల్వేశాఖ నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్నందున రైల్వే స్టేషన్లో మెరుగైన ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.
'ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్లే!'
"తొక్కిసలాట ఘటన మరోసారి రైల్వే శాఖ వైఫల్యాన్ని, ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపింది. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాటలో అనేక మంది మరణించడం, గాయపడటం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి." అని ఎక్స్‌లో రాహుల్ పోస్ట్ చేశారు.
नई दिल्ली रेलवे स्टेशन पर भगदड़ मचने से कई लोगों की मृत्यु और कईयों के घायल होने की ख़बर अत्यंत दुखद और व्यथित करने वाली है।
— Rahul Gandhi (@RahulGandhi) February 16, 2025
शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।
यह घटना एक बार फिर रेलवे की नाकामी और सरकार…
మృతుల సంఖ్యను వెల్లడించండి : ఖర్గే
తొక్కిసలాట మరణాల సంఖ్యను దాచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. "తొక్కిసలాటలో చాలా మంది మరణించారనే వార్తలు నన్ను బాధించాయి. దిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య దాచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం చాలా సిగ్గుచేటు, ఖండించదగినది. మృతులు, గాయపడిన వారి సంఖ్యను ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రకటించాలి." అని ఖర్గే ఎక్స్‌లో పోస్టు చేశారు.
'ఆ విజువల్స్ భయంకరంగా ఉన్నాయి'
ప్రభుత్వ అసమర్థత కారణంగానే తొక్కిసలాట ఘటన జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. "ఇది తీవ్ర విషాదకరం. దిల్లీ రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. కేంద్రం పర్యవేక్షణలో, దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం పూర్తిగా ప్రభుత్వ అసమర్థతే. మరణించిన, గాయపడినవారి కచ్చితమైన గణాంకాలు ఎప్పుడు తెలుస్తాయి?. రద్దీ నియంత్రణకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కుంభమేళా నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఎందుకు నడపలేదు?" అని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.
నిర్వహణ లోపం వల్లేనన్న ఆప్
దిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నిర్వహణ లోపం వల్లే జరిగిందని ఆప్ సైతం ఆరోపించింది. రద్దీ నియంత్రణ చర్యలు లేవడానికే ఇదొక స్పష్టమైన ఊదాహరణ అని విమర్శించింది. తొక్కిసలాటకు బాధ్యులను జవాబుదారీగా ఉంచాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా తక్షణ సంస్కరణలను చేపట్టాలని కోరారు.
లాలూ స్పందన
రైల్వే శాఖ నిర్వహణ లోపం వల్లే తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. "ఈ సంఘటన చాలా దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఘటనకు రైల్వే మంత్రి బాధ్యత వహించాలి" అని లాలూ విమర్శించారు.
కమిటీ ఏర్పాటు
మరోవైపు ఈ తొక్కిసలాటపై అత్యున్నత స్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో వేసిన విచారణ కమిటీకి ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులను ఎంపిక చేసింది. ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ డియో, ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ పంకజ్ గంగ్వార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారని రైల్వే శాఖ ప్రకటించింది.