Delhi Railway Station Stampede Reason : ప్రయాగ్‌రాజ్ వెళ్లే ట్రైన్ల పేర్లు దాదాపు ఒకేలా ఉండటమే దిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసిందని దిల్లీ పోలీసులు తెలిపారు. 'ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్', 'ప్రయాగ్‌రాజ్ స్పెషల్' ట్రైన్ల పేర్లతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారని వెల్లడించారు. ఈ మేరకు చేసిన అనౌన్స్‌మెంట్‌తో తమ రైలు అనుకుని ప్రయాణికులు వేరే ప్లాట్‌ఫామ్ వద్దకు దుసుకెళ్లారని చెప్పారు. అంతేకాకుండా కొన్ని రైళ్లు ఆలస్యం కావడం కూడా ఈ ఘటన జరగడానికి కారణమని వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం-- దిల్లీ రైల్వే స్టేషన్‌లోని 16వ ప్లాట్‌ఫామ్ వద్దకు 'ప్రయాగ్‌రాజ్ స్పెషల్' రైలు వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. అదే సమయంలో 'ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్' కోసం 14వ ప్లాట్‌ఫామ్‌పై వేచి చూస్తున్న ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. 14వ ప్లాట్‌ఫామ్‌కు బదులు తమ ట్రైన్ 16వ ప్లాట్‌ఫామ్ పైకి వస్తుందనుకుని అటువైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఒక్కసారిగా జనం గుమిగూడారు. వంతెనపై నుంచి దిగుతున్న క్రమంలో మెట్లపై స్లిప్ అయి ఒకరిపై ఒకరు పడిపోయారు. ఫలితంగా తొక్కిసలాటకు దారితీసింది. ప్రతి గంటకు 1,500 సాధారణ టిక్కెట్లను రైల్వే విక్రయించిందని, ఫలితంగా స్టేషన్ మరింత రద్దీగా మారిందని ఉత్తర్ రైల్వే సీపీఆర్ఓ హిమాన్షు ఉపాధ్యాయ తెలిపారు.

ట్రైన్ల పేర్లకు తోడు, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన 4 రైళ్లలో మూడు ఆలస్యం అయ్యాయి. దీంతో స్టేషన్లో అనూహ్యంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. తొక్కిసలాట జరిగిన సమయంలో ప్లాట్‌ఫామ్ 14 వద్ద ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, ప్లాట్‌ఫామ్ 12 వద్ద మగధ్ ఎక్స్‌ప్రెస్, ప్లాట్‌ఫామ్ 13 వద్ద స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, ప్లాట్‌ఫారమ్ 15 వద్ద భువనేశ్వర్ రాజధాని ఉన్నాయి.
హై లెవెల్ మీటింగ్
తొక్కిసలాట నేపథ్యంలో దిల్లీ పోలీసులు ఆదివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మరో 6 కంపెనీల బలగాలను సిద్ధంగా ఉంచారు.
ఉన్నత స్థాయి విచారణ కమిటీ
ఈ ఘటనపై ఇద్దరు సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని(HAG) ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ డియో, నార్తర్న్ రైల్వే ప్రన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గంగ్వార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్‌లోని అన్ని వీడియో ఫుటేజీలను భద్రపరచాలని కమిటీ ఆదేశించింది.

ఆ చిన్నారులకు అమ్మ లేదు!
సంగం విహార్‌కు చెందిన పింకీ దేవీ తన ఇద్దరు మైనర్ కుమారులతో కుంభమేళాకు బయలుదేరింది. 14-15 మంది బృందంలో ప్రయాగ్‌రాజ్ వెళ్తోంది. ఈ క్రమంలో దిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందింది. నిర్లక్ష్యం, రైల్వే స్టేషన్ నిర్వహణ లోపం వల్లే ఈ ఘటన జరిగింది ఆమె బంధువు పింటు శర్మ ఆరోపించారు.

ఎటు చూసినా ప్రయాణికుల వస్తువులే
14, 15 ప్లాట్‌ఫామ్‌లలో ప్రయాణికుల చెప్పులు, వస్తువులు, దుస్తులు, ఆహారం ప్యాకెట్లు చెల్లచెదురుగా పడి ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున రైల్వే స్టాఫ్ రంగంలోకి దిగారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రాత్రంగా శ్రమించి వాటిని తొలగించారు. " ఎక్కడ చూసినా ప్రయాణికుల వస్తువులే. సగం తిని వదిలేసిన ఆహారం, చెప్పులు ఉన్నాయి. అందులో చిన్నారులు స్కూల్ బ్యాగ్ కూడా కనిపించింది. ప్రయాణికులకు వారి వస్తువులు తీసుకోవడానికి కూడా సమయం దొరకలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగుతీశారు" అని ఓ రైల్వే ఉద్యోగి తెలిపారు.

ప్రయాగ్‌రాజ్ అలర్ట్
దిల్లీ తొక్కసలాట నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు జారీ చేసిన ప్రోటోకాల్స్‌కు అందరూ కట్టుబడి ఉండాలని ఆయా స్టేషన్లకు సూచించారు. ప్రోటోకాల్స్ ప్రకారం ప్రయాణికులు సిటీ సైడ్ ప్రవేశ ద్వారం నుంచి రైల్వే స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వద్ద సివిల్స్ లైన్స్‌లో బయటకు వెళ్లాలి. ప్లాట్‌ఫామ్‌ల వద్దకు ట్రైన్స్ వచ్చే వరకు ప్రయాణికులు హోల్డింగ్ ఏరియాలో వేచి ఉండాలి.