Manohar Lal Khattar Resigned To MLA Post :ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు. 'నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఇకపై నా కర్నాల్ స్థానం బాధ్యతలను మన కొత్త సీఎం నాయబ్ సింగ్ సైనీ చూసుకుంటారు' అని తెలిపారు.
దీంతో ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి నాయబ్ సైనీ అక్కడి నుంచి పోటీ పడనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుతం సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ఇక, ఖట్టర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్నాల్ స్థానం నుంచే పోటీ చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బలం నిరూపించుకున్న సైనీ
మరోవైపు హరియాణా నూతన ముఖ్యమంత్రిగా మంగళవారం ప్రమాణం చేసిన నాయబ్ సింగ్ సైనీ బుధవారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఈ మేరకు శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. కొత్త సీఎంగా ప్రమాణం చేసిన సైనీ బలపరీక్ష నిమిత్తం శాసనసభ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. బుధవారం ఉదయం సీఎం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అయితే బలపరీక్ష సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లకూడదని జేజే పార్టీ విప్ జారీ చేసింది. అయినప్పటికీ ఈ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఓటింగ్ సమయంలో వారు సభ నుంచి వెళ్లిపోయారు. కాగా, తీర్మానంపై సభలో చర్చ జరిపిన అనంతరం మూజువాణీ ఓటింగ్ చేపట్టారు. 48 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సైనీ విజయం సాధించారు. అయితే బలపరీక్ష నిరూపణకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం.
కొంప ముంచిన విభేదాలు
90 స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలుండగా, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 30, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోక్‌దళ్, హరియాణా లోక్‌హిత్ పార్టీకి చెరొక సభ్యుడు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ, మిత్రపక్షం జేజేపీ మధ్య విభేదాలు తలెత్తిన కారణంగా ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది.
సీనియర్ సిటిజెన్లకు రూ.3000
అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సమయంలో మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను తన పొగడ్తలతో ముంచెత్తారు కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సైనీ. 'మనోహర్‌జీ రాష్ట్రంలో సీనియర్ సిటిజెన్ల కోసం అద్భుతమైన పథకం ప్రవేశపెట్టారు. ఈ స్కీం కింద రూ.3వేల పెన్షన్ నేరుగా వృద్ధుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది' అని నాయబ్ సింగ్ సైనీ తెలిపారు. అంతకుముందు 'కొత్త సీఎంగా అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్ర అమిత్ షా సహా పార్టీలోని ఇతర సీనియర్ నేతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రాభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తాను' అని ముఖ్యమంత్రి సైనీ పేర్కొన్నారు.
'అధికార దాహంతో కాదు పూర్తి నిజాయతీతో పనిచేశాం'
'బీజేపీతో ఏర్పాటైన 'ఘట్బంధన్ ధర్మ' కూటమిలో గత నాలుగున్నరేళ్లలో మేము పూర్తి నిజాయతీతో పనిచేశాం. ఎన్నడూ అధికార దాహం కోసం వెంపర్లాడలేదు' అని జన్నాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు అజయ్ సింగ్ చౌతాలా తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీతో బీజేపీ పొత్తు తెగిన తర్వాతి రోజు ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సొంత తమ్ముడితో దీదీ బంధం కట్- తగ్గేదే లేదంటూ మమతా బెనర్జీ ప్రకటన
అయోధ్యకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక- ఇవి పాటిస్తే దర్శనం చాలా ఈజీ!