Babas In Maha Kumbh 2025 : పరమ పవిత్ర మహాకుంభ మేళాకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మేళా జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ అపురూప ఘట్టంలో భాగమయ్యేందుకు ఎంతో మంది సాధువులు, బాబాలు, సన్యాసులు ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు. వీరిలో కొంత మంది బాబాలు తమ ప్రత్యేకతతో ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అంబాసిడర్ బాబా
మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు అంబాసిడర్ బాబా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. ఆయన అంబాసిడర్ కారు కాషాయ రంగులో ఉంటుంది. అంబాసిడర్ బాబా మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ వాస్తవ్యులు. ఆయన వయసు 50 ఏళ్లకుపైనే ఉంటుంది. ఇదే కారులో ఇప్పటి వరకు ఆయన నాలుగుసార్లు కుంభమేళాకు వచ్చారట. 1972 మోడల్‌కు చెందిన అంబాసిడర్ కారును బాబా ఇప్పటికీ వాడుతున్నారు. గత 35 ఏళ్లుగా ఆయన ప్రయాణాల్లో అది ముఖ్య భాగంగా ఉంది. 'ప్రయాణాల్లో ఉన్నప్పుడు నేను ఆ కారులోనే తింటాను. పడుకుంటాను. అదే నా జీవితం. నా కారుకు మెకానిక్ రిపేర్ చేసేటప్పుడు నేను అతడి పక్కనే ఉంటాను. మహాకుంభ మేళా ముగియగానే నేను వారణాసికి వెళ్తాను' అని అంబాసిడర్ బాబా చెప్పుకొచ్చారు.
రుద్రాక్ష్ బాబా
మహాకుంభ మేళాకు రుద్రాక్ష్ బాబా కూడా చేరుకున్నారు. ఈయన 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆ మాలల్లో దాదాపు 11వేల రుద్రాక్షలు ఉన్నాయి. వాటన్నింటి బరువు దాదాపు 30 కేజీలు ఉంటుందట. 'చాలా ఏళ్లుగా నేను 108 రుద్రాక్ష మాలలు ధరిస్తున్నా. చాలామంది భక్తులు నాకు ఈ రుద్రాక్ష మాలలను ఇచ్చారు' అని రుద్రాక్ష బాబా తెలిపారు. సోషల్ మీడియాలోనూ ఈయనకు పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్స్ ఉన్నారు.
దిగంబర్ నాగ బాబా, ఖాదేశ్వర్ నాగ బాబా
మహాకుంభ మేళాలో దిగంబర్ నాగ బాబా, ఖాదేశ్వర్ నాగ బాబాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. మేళా ప్రాంగణంలో దిగంబర్ నాగ బాబా కుడి చేతిని పైకి లేపి నిలబడ్డారు. సనాతన ధర్మాన్ని, భారతదేశ భవిష్యత్తును పరిరక్షించాలనే డిమాండ్‌తో తాను కుడి చేతిని పైకి లేపి గత ఐదేళ్లుగా నిలబడుతున్నానని ఆయన తెలిపారు. ఖాదేశ్వర్ నాగ బాబా సైతం గత 12 ఏళ్లుగా మేళా ప్రాంగణంలో కుడి చేతిని పైకిలేపి నిలబడి ఉన్నారు. సనాతన ధర్మ రక్షణ కోసం తాను తుదిశ్వాస వరకు ఇలాగే నిలబడతానని ఖాదేశ్వర్ నాగ బాబా చెబుతున్నారు. పాలిథీన్‌ను వాడొద్దని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఛోటు బాబా, చాబీ వాలే బాబా
ఛోటు బాబా కూడా మహాకుంభ మేళాలో స్పెషల్‌గా నిలుస్తున్నారు. ఆయన గత 32 ఏళ్లుగా స్నానం చేయలేదు. 20 కేజీల బరువున్న తాళం చెవితో తిరుగుతున్న చాబీ వాలే బాబా కూడా మేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్‌కు ఈ-రిక్షా బాబా కూడా చేరుకున్నారు. కేవలం ఈ-రిక్షాలో ప్రయాణించడం ఆయన స్పెషాలిటీ.