Pudina Chutney Recipe in Telugu : బిర్యానీ, ఫ్రైడ్ రైస్, కిచిడీ, నాన్‌వెజ్ రెసిపీలలో పుదీనాను ఎక్కువగా వాడుతుంటాం. అలాగే ఆలుగడ్డ, బీన్స్ లాంటి ఏ కర్రీలో వేసినా అదనపు టేస్ట్ వస్తుంది. అలాగే, చాలా మంది ఎక్కువగా పుదీనాతో వివిధ రకాలుగా చట్నీని చేసుకుంటుంటారు. కానీ, ఓసారి ఈ స్టైల్లో పుదీనా చట్నీని ట్రై చేయండి. గోంగూర పచ్చడి కంటే టేస్టీగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది! వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. పైగా దీనిలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పుదీనా ఆకులు - 2 నుంచి 3 ఆకులు
- తెల్ల నువ్వులు - పావుకప్పు కంటే కొద్దిగా ఎక్కువ
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - రుచికి సరిపడా
- టమాటాలు - 2
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- వెల్లుల్లి రెబ్బలు - 10
- జీలకర్ర - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అరటీస్పూన్
- శనగపప్పు - అరటీస్పూన్
- మినప్పప్పు - అరటీస్పూన్
- ఎండుమిర్చి - 2
- ఇంగువ - కొద్దిగా
- కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం :
- ముందుగా ఒక గిన్నెలో పుదీనా ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి తెల్ల నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకొని పక్కనుంచాలి. అనంతరం అదే పాన్‌లో 1 టేబుల్‌స్పూన్ నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత అదే ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసి అందులోని వాటర్ ఇగిరిపోయి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
- ఆవిధంగా ఫ్రై చేసుకున్నాక పుదీనాను ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో మరో టేబుల్‌స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు వేసుకొని కలిపి మూతపెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. టమాటాలు కాస్త సాఫ్ట్‌గా ఉడికితే సరిపోతుంది.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న నువ్వులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో వేయించిన పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని మరోసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆపై మూత తీసి కలిపి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పుదీనా ఆకులు, చల్లారిన టమాటా మిశ్రమం వేసుకొని మరీ మెత్తగా కాకుండా రోట్లో రుబ్బుకున్నట్లుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆపై ఇంగువ, ఎండుమిర్చి, చితకొట్టిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని పోపును చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగిందనుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని దాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "పుదీనా పచ్చడి" రెడీ!
ఇవీ చదవండి :
ఓసారి ఇలా "ఉల్లిపాయ టమటా పచ్చడి" చేయండి - అన్నం, టిఫెన్స్ దేనిలోకైనా అద్దిరిపోతుంది!
నోటికి కమ్మగా, పుల్లగా ఉండే "చింతకాయ పచ్చడి" - ఈ కొలతలతో పెడితే ఏడాది పైనే నిల్వ!