Lok Sabha Polls Punjab : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, అవి ముగియగానే పంజాబ్‌లో మరో ఎన్నికల సమరం వచ్చే అవకాశం ఉంది! ఎందుకంటే ఆ రాష్ట్రానికి చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరు విజయం సాధిస్తే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో 9 నియోజకవర్గాల్లో 12 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వీరిలో ఐదుగురు మంత్రులు ఉండటం గమనార్హం. ఆరు లోక్‌సభ స్థానాల్లో ఒక్కో ఎమ్మెల్యే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, మరో మూడు స్థానాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు.
ఆప్ నుంచి వీరే!
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న ఎమ్మెల్యేల్లో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందినవారే తొమ్మిది మంది ఉన్నారు. మిగతా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆప్ నుంచి పోటీ పడుతున్న మంత్రుల్లో అమృత్‌సర్ నుంచి కుల్‌దీప్‌సింగ్, ఖాదూర్ సాహిబ్ నుంచి లల్‌జిత్ సింగ్ భుల్లార్, బఠిండా నుంచి గుర్మీత్ సింగ్ ఖుడియాన్, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీట్ హయర్, పటియాల నుంచి బల్బీర్ సింగ్ ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి ఎవరంటే?
అయితే కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించిన 12 మంది అభ్యర్థుల జాబితాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అమరీందర్ సింగ్ వారింగ్ లుధియానా నుంచి పోటీ చేస్తున్నారు. భోలత్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా సంగ్రూర్ నుంచి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రంధావా గుర్‌దాస్‌పుర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఈ నియోజకవర్గాల్లో ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు వీరి ప్రత్యర్థులుగా ఉన్నారు.