Nitesh Rane on Saif Ali Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి విషయంలో మహారాష్ట్ర బీజేపీ నేత, మంత్రి నితేశ్ రాణె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సైఫ్ అలీఖాన్‌పై నిజంగా దాడి జరిగిందా లేదా ఆయన నటిస్తున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. పుణెలో జరిగిన ఓ బహిరంగ సభలో ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు.
"బంగ్లాదేశీయులు ముంబయిలో ఏం చేస్తున్నారో చూడండి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంతకుముందు వారు క్రాస్ రోడ్ల వద్ద నిల్చుండేవారు. కానీ ఇప్పుడు ఇళ్లలోకి చొరబడుతున్నారు. బహుశా ఆ బంగ్లాదేశీయుడు ఆయన్ను(సైఫ్ అలీఖాన్) తీసుకెళ్లడానికి వచ్చి ఉండవచ్చు. ఆయన(సైఫ్ అలీఖాన్) ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినప్పుడు నేను చూశాను. నిజంగా ఆయన కత్తిపోటుకు గురయ్యాడా లేదా నటిస్తున్నాడా అని నాకు అనుమానం వచ్చింది. ఆయన నడుస్తున్నప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు" అని నితేశ్ రాణె ఆరోపించారు.
అంతేకాకుండా ఎన్సీపీ(ఎస్పీ) నేతలు సుప్రియా సూలే, జితేంద్ర అవాద్పై నితేశ్ రాణె ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైఫ్ అలీఖాన్, షారుఖ్ ఖాన్ కుమారుడు, నవాబ్ మాలిక్ గురించే ఈ నేతలు ముందుకొస్తారని, హిందూ నటుడ్ని వేధిస్తే మాత్రం ముందుకు రారని మండిపడ్డారు.
'6 గంటల పాటు ఆపరేషన్- 4 రోజుల్లో అలా నడుస్తారా?'
అంతకుముందు శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్- దాడి ఏ విధంగా జరిగిందని ప్రశ్నించారు. "సైఫ్ కుటుంబం ముందుకు వచ్చి దాడి గురించి పూర్తి వివరాలు వెల్లడించాలి. ఎందుకంటే సైఫ్‌పై దాడి తర్వాత ముంబయిలో శాంతిభద్రతలు కుప్పకూలిన వాతావరణం ఏర్పడింది. మహారాష్ట్ర హోం శాఖ విఫలమైంది. ముంబయిలోని పౌరులు సురక్షితంగా లేరు. అయితే నేను వైద్యులను అడుగుతున్నది ఒకటే-- సైఫ్ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తీరు చూస్తే నాలుగు రోజుల క్రితం ఏం జరగనట్లు అనిపిస్తుంది. ఆరు గంటల పాటు ఆపరేషన్ అయిన వ్యక్తి- నడిచే స్థితిలో బయటకు రాగలరా?" అని ప్రశ్నించారు సంజయ్ నిరుపమ్.
'అది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే'
అయితే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అవి కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని, పోలీసులు ఈ కేసులో నిజాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు.