Maharashtra Train Accident Reason : రైల్లో మంటలు చెలరేగాయన్న వదంతి ఉత్తర మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి దారితీసింది. దీనిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది గాయపడ్డారు. ముంబయికి 400 కి.మీ. దూరంలోని మహేజి-పర్ధాడె స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో ఆ ప్రమాదం జరిగింది. లఖ్‌నవూ-ముంబయి పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వచ్చాయని తొలుత కలకలం రేగింది.
130-140 కి.మీ వేగంతో వచ్చిన రైలు ఢీకొని
దీంతో తమకు మంటలు అంటుకుంటాయనే ఆందోళనతో అలారం చెయిన్‌ను లాగి కిందికి దిగిన ప్రయాణికులు పక్కనున్న మరో ట్రాకుపైకి చేరారు. అదే సమయంలో ఆ ట్రాకుపై గంటకు 130-140 కి.మీ వేగంతో దూసుకువస్తున్న 12627 బెంగళూరు-దిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొంది. దీంతో క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు ఆగుతుండగా ప్రయాణికులు రెండువైపుల నుంచి కిందికి దూకారని, వారిలో అవతలి ట్రాకువైపు దిగినవారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఫ్లాష్‌లైట్ కూడా వేశాం!
మలుపు ఉన్న ప్రాంతం కావడం వల్ల కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు దృశ్య స్పష్టత కొంత తక్కువగా ఉందని, బ్రేకులు వేసేందుకు సమయం సరిపోదని రైల్వే వర్గాలు తెలిపాయి. రెండు రైళ్ల లోకోపైలట్లు అన్ని నిబంధనల్ని పాటించారని, ప్రమాదం జరగకుండా శక్తిమేరకు ప్రయత్నించారని స్పష్టం చేశాయి. చెయిన్ లాగడం వల్ల పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఆగిందన్న విషయాన్ని తెలిపేలా ఫ్లాష్‌లైట్ కూడా వేశారని తెలిపాయి.
చక్రాల నుంచి వచ్చిన పొగలు చూసి!
పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైల్లోని సాధారణ తరగతి పెట్టె బ్రేకులు పట్టేయడం, లేదా ఇరుసు బిగుసుకుపోవటం (హాట్ యాక్సిల్) వల్ల చక్రాలు తిరగక నిప్పురవ్వలు ఎగసిపడి, పొగలు కూడా వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దాంతో ప్రయాణికులు భయపడ్డారని చెప్పారు. రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్ (సెంట్రల్ సర్కిల్) మనోజ్ అరోడా విచారణ జరపనున్నారు. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, ఇతర ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు ఆయన తెలిపారు.
తీవ్ర బాధాకరం: మోదీ
మరోవైపు, మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అలాంటి ఘటన జరగడం తీవ్ర బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి చెబుతూ, గాయపడిన వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు అధికారులు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రధాని మంత్రి కార్యాలయం పోస్ట్ చేసింది.
Anguished by the tragic accident on the railway tracks in Jalgaon, Maharashtra. I extend my heartfelt condolences to the bereaved families and pray for the speedy recovery of all the injured. Authorities are providing all possible assistance to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2025
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ రూ.1.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000, స్వల్ప గాయాలైన వారికి రూ.5,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విచారం వ్యక్తంచేశారు.