Lok Sabha Polls 2024 Fourth Phase :లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జరిగిన నాలుగో విడతలో మెుత్తంగా 67.70 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం- EC వెల్లడించింది. నాలుగో దశలో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సోమవారం దాదాపు ప్రశాంతంగానే ముగిసింది. ఆంధ్రప్రదేశ్, బంగాల్‌లలో మాత్రం కొన్నిచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నాలుగో దశలో 67.70శాతం పోలింగ్ నమోదైందని అయితే ఇది తాత్కాలిక సమాచారమేనని EC వెల్లడించింది. వివిధ ప్రాంతాల నుంచి పూర్తిస్థాయి గణాంకాలు అందిన తర్వాత ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తాజా విడతలో అత్యధికంగా బంగాల్‌లో 78.44 శాతం ఓటింగ్ నమోదైందని తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో అత్యల్పంగా కేవలం 37.98 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొంది. అయితే గత కొన్ని దశాబ్దాల్లో జమ్మూకాశ్మీర్‌లోఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఈసీ తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో షాజహాన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకొన్ని గ్రామాల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామాలు రోడ్ల నిర్మాణం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోవడం లేదని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఝార్ఖండ్‌లో పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సోనాపీ, మెురాంగ్‌పొంగా ప్రాంతాల్లో చెట్టును కొట్టి అడ్డుగా వేయడం ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాకను అడ్డుకోవాలని మావోయిస్టులు ప్రయత్నించగా భద్రతా బలగాలు ఆ అడ్డును తొలగించాయి. ఒడిశాలో పలుచోట్ల EVMలు మొరాయించాయి. దీంతో విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఒడిశాలో ఇద్దరు పోలింగ్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది.