Lighting Strike In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబాజార్ భటపరా జిల్లాలో విషాదం నెలకొంది. మొహతారా గ్రామంలో పిడుగుపాటుకు గురై ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం, గ్రామంలో పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో కొంతమంది పొలం సమీపంలో ఉన్న చెట్టుకిందికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెంతారు. మృతులను సురేష్ సాహు, సంతోష్ సాహు, పప్పు సాహు, పోఖారం విశ్వకర్మ, థానేశ్వర్ సాహు, దేవదాస్, విజయ్ సాహులుగా అధికారులు గుర్తించారు. చేతన్ సాహు, బిందారం సాహు, బిసంభర్ సాహు గాయపడ్డారని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వారందరిని ఆస్పత్రికి తరలించినట్లు, చికిత్స కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
వర్షాలపై హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. కొరియా, కోర్బా, ధమ్తరి, గరియాబంద్, దంతేవాడ, సుక్మా, కాంకేర్, బీజాపుర్, నారాయణపుర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.