Delhi CM Rekha Gupta On Charge : దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురి ప్రముఖల సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆమె సచివాలయానికి వెళ్లారు. ఆ సమయంలో రేఖా గుప్తా వెంట దిల్లీ బీజేపీ ఇన్ఛార్జ్ బైజయంత్ పండా, అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సహా పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
వికసిత్ దిల్లీ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం ఒక్క రోజు కూడా వృథా చేయదని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను తాము నెరవేరుస్తామని చెప్పారు. కొత్త మంత్రివర్గం గురువారం సాయంత్రం 7 గంటలకు సమావేశమవుతుందని వెల్లడించారు. అనంతరం మంత్రులతో కలిసి యమునా ఘాట్‌లో హారతి ఇస్తామని పేర్కొన్నారు.
#WATCH | Delhi CM Rekha Gupta formally assumes the office at the Secretariat as the 4th overall and 2nd woman BJP CM of Delhi pic.twitter.com/cfl6tYhsn6
— ANI (@ANI) February 20, 2025
#WATCH | Delhi BJP MPs welcome CM Rekha Gupta at Delhi secretariat
— ANI (@ANI) February 20, 2025
Rekha Gupta will assume charge of the office, shortly pic.twitter.com/CSJjUbqiaJ
రేఖా గుప్తా సర్కార్‌కు సవాళ్ల స్వాగతం
దిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే కీలక ఎన్నికల హామీలను అమలు చేయడం రేఖాగుప్తా సర్కార్‌కు కత్తిమీద సాములాగే కనిపిస్తోంది. ఇదే సమయంలో రాజధాని నగరాన్ని కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్న కాలుష్య భూతాన్ని తరిమికొట్టడం, మౌలిక వసతుల కల్పన, యమునా నది ప్రక్షాళన బీజేపీ ప్రభుత్వం ముందు అతిపెద్ద సమస్యలుగా ఉన్నాయి.
దిల్లీలో 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ మొదట ఎన్నికల హామీలపై దృష్టిపెడతామని ఇప్పటికే సంకేతాలిచ్చింది. దిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం పూర్తి నిజాయితీతో, అంకితభావంతో పనిచేస్తానని సీఎం రేఖా గుప్తా ఇప్పటికే ప్రకటించారు. ఈ కోవలో ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు చెల్లించే పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. ఇది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో అత్యంత కీలకమైన పథకం.
ఇదే సమయంలో ఆప్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని బీజేపీ ప్రకటించినందున 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి ఉంది. ఉచితంగా మంచినీటి కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. దిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించాల్సి ఉండగా మరో రూ.5 లక్షలు అదనంగా ఖర్చు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆప్ సర్కార్ తీసుకొచ్చిన మొహల్లా క్లినిక్‌ల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన బీజేపీ నేతలు వాటిని ప్రక్షాళన చేస్తామని చెప్పారు.
యమునా నది ప్రక్షాళన పెద్ద సవాల్!
కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని ప్రక్షాళన చేయడం, బీజేపీ సర్కారు ముందున్న మరో సవాలు. గత పదేళ్లలో ఆప్ సర్కారు యమునానదిని పట్టించుకోలేదని బీజేపీ విమర్శిస్తూ వచ్చింది. అధికారంలోకి రాగానే యమునానదిని శుద్ధి చేస్తామని ప్రధాని మోదీ సైతం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది.
వాయుకాలుష్యం మరో అతిపెద్ద సమస్య
దిల్లీలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా తయారైందని బీజేపీ నేతలు పెద్దఎత్తున ఆప్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఫలితంగా ఆయా వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత రేఖాసింగ్ సర్కార్‌పై ఉంది. దిల్లీలో వాయుకాలుష్యం అతిపెద్ద సమస్యగా తయారైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక రాజధానుల్లో దిల్లీ ఒకటిగా నిలిచింది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు సమర్థ విధానాలను అమలుచేయడం సహా ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.