Jammu Kashmir Election Result 2024 : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఎన్సీ 42 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుందుభి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. అందులో ఒకరు ఆప్ అభ్యర్థి ఉన్నారు.
ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్పు వంటి నిర్ణయాల నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ ప్రజలు ఎన్సీ-కాంగ్రెస్ కూటమివైపే మొగ్గు చూపారు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధనకు కృషి చేస్తామన్న వాగ్దానాన్ని నమ్మి- ఆ రెండు పార్టీలకే పట్టం కట్టారు. పీడీపీ కూడా ఇలాంటి హామీలే ఇచ్చినా- గతంలో బీజేపీతో జట్టు కట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని నమ్మలేదు.
చరిత్రలో తొలిసారి జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందింది ఆప్. దోడా నియోజకవర్గం నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేసిన మెహ్రాజ్ మాలిక్- బీజేపీ అభ్యర్థిపై గజయ్ సింగ్ రాణాపై 4,538 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తానికి జమ్ముకశ్మీర్‌లో హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వేయగా, అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
జుమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు (ETV Bharat) బీజేపీ ఓటమికి కారణాలివేనా?
జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా తమదే అధికారమని తెలిపింది. కానీ 29 సీట్లనే గెలుచుకుని అధికారం దక్కించుకోలేకపోయింది. జమ్ములోనే ఆ 29 సీట్లు గెలుచుకున్న బీజేపీ, కశ్మీర్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి!
జుమ్ములోని మొత్తం 43 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, క్లీన్ స్వీప్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లే ప్రణాళికలు రచించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖలంతా జమ్ములో పర్యటించారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ ఉచిత హామీలు ప్రకటించారు. కచ్చితంగా అన్ని స్థానాల్లో విజయం తమదేనని అంచనా వేశారు. కానీ 29 స్థానాలే కైవసం చేసుకున్నారు.