Central Government Research Centers Using Social Media Platforms For Science : సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఏం నడుస్తుందంటే అందరి నోటా వచ్చే మాట రీల్స్. వినోదమే కాకుండా వ్యాపార ప్రకటనలు, ప్రచారాల వరకు వీటిదే హవా. ప్రభుత్వాల వైఫల్యాలపై వ్యంగ్యాస్త్రాలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు ఏవైనా రీల్స్ చేస్తున్నారు. పిల్లలు, కుర్రకారు మొదలు, పెద్దల వరకు మొబైల్ రీల్స్ చూడటానికి గంటల సమయం గడుపుతున్నారు. ఇంతటి జనాదరణ కలిగిన రీల్స్‌ను వినియోగించి సైన్స్‌ను జనంలోని తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌లోని కేంద్ర పరిశోధన సంస్థలు సమాలోచనలు చేస్తున్నాయి.
ఎక్స్‌లో షేర్ చేస్తూ : నగరంలోని తార్నాక నుంచి ఉప్పల్ వరకు సైన్స్ కారిడార్‌లో పలు కేంద్ర పరిశోధన సంస్థలు ఉన్నాయి. ఐఐసీటీ, ఎన్జీఆర్ఐ, సీడీఎఫ్‌డీ, సీసీఎంబీ, సర్వే ఆఫ్ ఇండియా కేంద్రాలు మనకు కనిపిస్తుంటాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా చాంద్రాయణగుట్ట వరకు వెళ్తే డీఆర్డీవో ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రజల పన్నులతో నడుస్తున్న ఈ సంస్థలు, తమ పరిశోధనల గురించి వారు చేసిన ఆవిష్కరణలు, ముఖ్యమైన విషయాలను ఎక్స్‌లో పంచుకుంటున్నాయి.
సీసీఎంబీ యూట్యూబ్ సిరీస్‌లు మొదలుపెట్టింది. సైన్స్‌పై కొత్తతరంలో ఆసక్తి పెంచడంతో పాటూ తమ చుట్టుపక్కల ఉన్న ప్రయోగశాలల్లో ఏం చేస్తున్నారనే విషయాలను ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. కానీ ఇవి చాలా తక్కువ మందికే చేరుతున్నాయి. దీంతో కొన్ని సంస్థలు వినూత్న ఆలోచన చేస్తున్నాయి. ప్రజల్లోకి సృజనాత్మకంగా తీసుకెళ్లేందుకు ముఖ్యంగా యువత లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
సీసీఎంబీ 'ఓపెన్ డే' - పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన - CCMB HYD Open Day Programme
చర్చలు : గంటల తరబడి వీడియోలను చూసే వారి సంఖ్య అధికమే. అందులో సైన్స్ వీడియోలు అంటే చాలా తక్కువ. అందుకే రీల్స్ చేసి సామాన్య ప్రజలకు చేరవేసి చేరువ కావొచ్చని పరిశోధన సంస్థలు ఆలోచన చేస్తున్నాయి. రీల్స్‌ను 30 సెకన్లలో తీస్తారు. 90 సెకన్లకు మించి ఉండదు. ఈ తక్కువ సమయంలోనే సూటిగా, సుత్తిలేకుండా పరిశోధనలతో సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయాల్సి ఉంటుంది. ఇందుకోసం భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫిల్మ్, టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో చర్చిస్తున్నామని హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరెక్టర్ ఆచార్య ఉల్లాస్ చెప్పారు.
'సైంటిఫిక్ టెంపర్ ఉన్న సమాజం ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాం. సైన్స్‌లో చాలా ఆవిష్కరణలు సామాన్య మానవులకు చేరడం లేదు. ప్రస్తుతం సైన్స్ లిటరసీ ఒక సవాల్‌గా మారింది. అక్షర జ్ఞానంతో ఆగిపోకుండా వైజ్ఞానిక అక్షరాస్యతను పెంపొందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏహెచ్ ప్రకారం సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిడం కుదురుతోంది. ప్రస్తుతం యువత సమాజంలో మూఢనమ్మకాలకు విపరీతంగా నమ్ముతున్నారు. వీరిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు రీల్స్ ఆలోచన వచ్చింది. ఇప్పటి కాలంలో యువత ఎక్కువగా ఇస్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్నారు. తక్కువ నిడివితో రీల్స్ చేస్తున్నాం. వీడియోలను లక్షల సంఖ్యలో చూస్తున్నారు. జనంలోకి తీసుకెళ్లగలిగాం. ప్రజల నుంచి స్పందన బాగుంది. ఈ తరానికి చేరేందుకు సంప్రదాయ పద్ధతుల్లో సాధ్యం కాదు. కొత్త పద్ధతులను వెతకాలి. రీల్స్ అలాంటివే కాకుండా ఏమైనా ఉంటే కూడా ప్రయత్నించవచ్చు.' అని విజ్ఞానదర్శిని అధ్యక్షుడు రమేశ్ వివరించారు.