జమ్ముకశ్మీర్‌లో మూడో విడత పోలింగ్ మంగళవారం ముగిసింది. చివరి దశలో 68.72 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మూడు దశల్లో కలిపి 63.45 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
జమ్ముకశ్మీర్‌లో ముగిసిన ఎన్నికల పర్వం- మూడు విడతల్లో కలిపి 63.45 శాతం ఓటింగ్ నమోదు : EC - Jammu and Kashmir Elections 2024
Published : Oct 1, 2024, 6:40 AM IST
|Updated : Oct 1, 2024, 10:08 PM IST
Jammu and Kashmir Elections 2024 Live Updates :జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జమ్ము ప్రాంతంలో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో ఉన్న 415 మంది అభ్యర్థుల భవితను 39.18 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఉపముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బెయిగ్ కూడా ఉన్నారు.5,060 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిమిత్తం దాదాపు 20 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 370 రాజ్యాంగ అధికరణం రద్దు తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న ఉంటుంది.
LIVE FEED
మూడు దశల్లో కలిపి 63.45 శాతం ఓటింగ్ నమోదు : EC
సాయంత్రం 5 గంటల వరకు 65.48శాతం ఓటింగ్
జమ్ముకశ్మీర్‌లో 40 నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 65.48శాతం ఓటింగ్ నమోదైంది.
- బందిపుర్-63.33%
- బారాముల్లా-55.73%
- జమ్ము-66.79%
- కథువా- 70.53%
- కుప్వారా-62.76%
- సాంబా-72.41%
- ఉధంపుర్-72.91%
మధ్యాహ్నం 3 గంటల వరకు 56.01% పోలింగ్
జమ్ముకశ్మీర్‌లో 40 నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 56.01శాతం ఓటింగ్ నమోదైంది.
- బందిపుర్-53.09%
- బారాముల్లా-46.09%
- జమ్ము-56.74%
- కథువా- 62.43%
- కుప్వారా-52.98%
- సాంబా-63.24%
- ఉధంపుర్-64.43%
జమ్ముకశ్మీర్‌లో 40 నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 44.08శాతం ఓటింగ్ నమోదైంది.
జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 28.12శాతం మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జమ్ముకశ్మీర్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 11.6శాతం ఓట్లు పోలయ్యాయి.
ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయండి : మోదీ
జమ్ముకశ్మీర్ తుది దశ పోలింగ్ జరగుతున్నందున, ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు, పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువతే కాకుండా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్ పాల్గొంటారని విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు శాంతి, భద్రత, ఉగ్రవాద రహితంగా చేసే దూరుదృష్టి ఉన్న ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 'ఈ చివరి దశ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు బలంతో అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే అవినీతి, ఉగ్రవాద రహిత జమ్ముకశ్మీర్‌ను సృష్టించగలదు. ప్రతి వర్గాల పౌరు హక్కులను కాపాడుతుంది. జమ్ముకశ్మీర్‌లో పర్యటకం, విద్య, ఉపాధి వంటి అభివృద్ధి కోసం ఓటు వేయండి' అని ఎక్స్ వేదికగా అమిత్ షా పిలుపునిచ్చారు
పోలింగ్ ప్రారంభం
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ బూత్‌ల ముందు క్యూ కట్టారు. అంతకుముందు అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు మాక్ పోలింగ్‌ను నిర్వహించారు.